101 మంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేస్తున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల నందమూరి బాలకృష్ణఅభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లతో భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద ప్రసాద్, దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – “నందమూరి బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. అదీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అభిమానులు కోరుకునే ‘పైసా వసూల్’ వంటి సినిమా తీసినందుకు మరింత సంతోషంగా ఉంది. సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. ఈ సందర్భంగా 101మంది పేద విద్యార్థులకు ఈ సందర్భంగా స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయించాము. బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్ల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులోనూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలనేది మా ఆలోచన” అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- “ఇన్నేళ్ల తర్వాత బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు హ్యాపీ. కానీ, సినిమా చేసిన తర్వాత ఆయనతో సినిమా చేయడం ఎందుకింత ఆలస్యమైందని ఫీలవుతున్నా. ఆయనతో పనిచేసిన తర్వాత మీరంతా ఎందుకు అభిమానులు అయ్యారనేది అర్థమైంది. జూబ్లీహిల్స్ లో బాలకృష్ణగారికి అభిమాన సంఘం ఉంటే నేనే దానికి అధ్యక్షుడిని అవుతా. అంతగా ఆయనకు నేను అభిమాని అయ్యాను. మళ్ళీ మళ్ళీ బాలకృష్ణగారితో కలసి పనిచేయాలనుకుంటున్నా. తప్పకుండా పనిచేస్తా” అన్నారు.