ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న రూమర్ ఇది. పవన్ కళ్యాణ్ కోసం పూరీ జగన్నాథ్ ఒక కథను కొంత కాలం క్రితం వినిపించాడని పవన్ కళ్యాణ్ పూరి చెప్పిన లైన్ కు ఓకే చెప్పాడని, పూర్తి కథను సిద్ధం చేయమని అడిగాడని, పూరి జగన్నాథ్ పూర్తి కథను సిద్ధం చేసుకుని ఇప్పుడు రెడీగా ఉన్నాడని త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ కు వెళ్తుందని ఈ రూమర్స్ సారాంశం. ఈ రూమర్స్ ఎంతవరకు నిజం, పైగా వీరిద్దరి మధ్య గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది వివరాల్లోకి వెళితే..
పవన్ తో పూరీ ప్రస్థానం మొదలు:
పూరి జగన్నాథ్ పరిచయం అయింది పవన్ కళ్యాణ్ తీసిన బద్రి సినిమాతోనే. ఆ తర్వాత కూడా పూరి జగన్నాథ్ ఇడియట్ , అమ్మా నాన్న తమిళ అమ్మాయి , పోకిరి సినిమా కథలను ముందుగా పవన్ కళ్యాణ్ కి చెప్పినప్పటికీ ఆయన వేర్వేరు కారణాలతో ఆ కథలను తిరస్కరించారు. జానీ సినిమాలో అప్పటికే ఫైట్స్ నేపథ్యం ఉండడం వల్ల అదే తరహా నేపథ్యం ఉన్న అమ్మా నాన్న తమిళ అమ్మాయి ని తిరస్కరించారని, అమ్మాయిలను టీజింగ్ చేసే సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇడియట్ సినిమా ని కథ నచ్చినప్పటికీ తిరస్కరించారని, పవన్ సన్నిహితులు చెబుతూ ఉంటారు. అయితే చివరికి వీరి కాంబినేషన్లో సెట్ అయిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా బాగానే ఉన్నప్పటికీ ఆ సినిమా పై తెలంగాణవాదుల నుండి అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అంతే కాకుండా ఆ సినిమా పూరి పవన్ కళ్యాణ్ ల మధ్య గ్యాప్ తీసుకు వచ్చింది.
పవన్ తో మళ్లీ సినిమా చేయను అని పూరీ అప్పట్లో వ్యాఖ్యానించారని వార్తలు
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ని తిట్టాడు అని పలు రూమర్లు వచ్చాయి. సినిమాలో నాజర్ పాత్ర ని రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో తయారుచేసుకున్నాడు అని, ఆ సినిమా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా ఉండేలా పూరి జగన్నాథ్ సన్నివేషాలు రాసుకున్నాడని, పవన్ కళ్యాణ్ కి ఈ విషయం పూరి జగన్నాథ్ ముందు చెప్పలేదని, దాంతో సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సన్నివేశాలు చూసి పూరి జగన్నాథ్ పై కోపపడ్డాడని ఆ రూమర్స్ సారాంశం. దీనికితోడు అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో ఇకపై సినిమాలు చేయను అని పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించినట్లు వచ్చింది. ఇది కూడా ఈ గుసగుసలకు బలం చేకూర్చింది. ఆ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ వచ్చిన కొత్తలో దీనిపై ఏమీ మాట్లాడని పూరీజగన్నాథ్ సరిగ్గా నితిన్ తో తీసిన తన సినిమా హార్ట్ అటాక్ విడుదలకు రెండు రోజుల ముందు ఈ గుసగుసలన్నింటిపై వివరణ ఇస్తూ ఇవన్నీ ఫేక్ అని, పవన్ కళ్యాణ్ తో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ పై తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని వ్యాఖ్యానించి రూమర్స్ కి ముగింపు పలికారు.
పూరి పవన్ తాజా కథ జనగణమన అంటూ రూమర్స్
పూరి జగన్నాథ్ ఎప్పటినుండో తన దగ్గర ఉన్న జన గణ మన కథ గురించి ఇంటర్వ్యూల లో చెబుతూ వస్తున్నారు ఈ కథను మహేష్ బాబు తో చేయడానికి ప్రయత్నాలు చేసిన సంగతి కూడా అప్పట్లో మీడియా ప్రకటించింది. అయితే ఈ కథపై మహేష్ బాబు పెదవి విరిచినట్లు, అందు వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పూరీ ఇదే జనగణమన కథ ని కొన్ని మార్పులు చేర్పులు చేసి వినిపించాడని, పైగా మెరుపువేగంతో పూరి జగన్నాథ్ సినిమాలు పూర్తి చేస్తాడని అందరికీ తెలిసిందే కాబట్టి , ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ పట్ల సానుకూలంగా ఉన్నాడని తాజాగా ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి ఈ రూమర్స్ కి ఎంత వరకూ నిజం పవన్, పూరీ కాంబినేషన్ నిజంగా సెట్ అవుతుందా అన్నది వేచి చూడాలి.