బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇష్టమైన దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి రైటింగ్ అంటే కూడా విజయేంద్ర ప్రసాద్ చాలా ఇష్టం. ఆయన ఫోన్ స్క్రీన్ షాట్ లో కూడా పూరి ఫోటో వుంటుంది. అయితే దర్శకుడు కాకముందే విజయేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారట పూరి,. అంతేకాదు.. రాజమౌళి, పూరి ఇద్దరూ దర్శకులు కాకముందే ఒకరికి ఒకరు పరిచయం. ఈ విషయాన్ని సుకుమార్ ఇంటర్వ్యూ లో బయటపెట్టారు పూరి.
”రాజమౌళి నాకు ఎప్పటినుంచో ఫ్రండ్. మేమిద్దరం ఇంకా సినీ పరిశ్రమలోకి రానప్పుడు.. కృష్ణవంశీ ఓసారి చెన్నైలో రాజమౌళిని పరిచయం చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు పెద్ద రచయిత అని మాత్రమే నాకు తెలుసు. రాజమౌళి నాకు పరిచయమయ్యాక.. ‘‘గురూ.. మీ ఫాదర్ని ఒక్కసారి చూడాలని ఉంది’’ అని అడిగా. తర్వాత ఓ సారి రాజమౌళి నన్ను వాళ్లింటికి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారు.. ఓ కుర్చీలో కూర్చొని ఏదో చదువుకుంటున్నారు. ఆయన కుర్చీ వెనుక సినిమా షీల్డ్స్, అవార్డులు, ఫొటోలున్నాయి. ‘‘పరిచయం చేయనా?’’ అని రాజమౌళి అడిగాడు. ‘‘వద్దులే బాగోదు’’ అని చెప్పి వచ్చేశా” అని గతాన్ని గుర్తు చేసుకున్నారు పూరి.