నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్.. ఈ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు పూరికి కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలన్న కోరిక బలంగా ఉంది. బాలయ్యతో ఓకే అనిపించుకోవడానికి మంచి కథ చెప్పడం మినహా.. పూరి దగ్గర వేరే మార్గం లేదు. అందుకే బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ కథని సిద్ధం చేసుకొన్నాడని టాక్. కథ వినిపించడానికి బాలయ్య దగ్గర అప్పాయింట్మెంట్ కూడా తీసుకొన్నాడని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో బాలయ్యనికలసి కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడట. ఇది వరకే శ్రీవాస్ కూడా బాలయ్యకు ఓ కథ చెప్పాడు. అదీ… బాలయ్యకు నచ్చేసింది. పూరి కథ చెప్పిన తరవాత… బాలయ్య ఎవరితో ప్రొసీడ్ అవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకోవొచ్చు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంలోనూ బాలయ్య తర్జన భర్జనలు చేస్తున్నాడట. స్క్రిప్టు ఆల్రెడీ సిద్ధమైందని, దాన్ని డీల్ చేయగలిగే దర్శకుడు దొరికితే చాలని సమాచారం. ఇప్పుడున్న స్టార్ దర్శకులకే.. ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ దశలో ఈ చిత్రానికి స్వయంగా తానే దర్శకత్వం వహించాలని బాలయ్య భావించాడట. అయితే ఎన్టీఆర్ పాత్రకి న్యాయం చేయడంపై దృష్టి పెడితే మంచిదని.. ఆ నిర్ణయం మానుకొన్నాడని తెలుస్తోంది.