మెహబూబా పరాజయం పూరిని బాగా కృంగదీస్తుండొచ్చు. ఎందుకంటే దర్శకుడిగా తాను విఫలమయ్యాడు. తన తనయుడ్ని సరిగా లాంచ్ చేయలేకపోయాడు. ఆస్తులు అమ్మి తీసిన సినిమా ఇది. ఆర్థికంగానూ నష్టాలు తప్పవు. అయితే ఇక్కడితో పూరి పనైపోయిందని చెప్పలేం. పూరి ప్రతిభ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తను ఇచ్చిన హిట్లు అలాంటిలాంటివి కావు. కాకపోతే.. పూరి తన తప్పుల నుంచి, తన స్కూల్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. తన తదుపరి సినిమా కూడా ఆకాష్‌తోనే చేయాలని పూరి నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన సరంజామా కూడా సిద్ధమైంది. కాకపోతే.. పూరి ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకోవాలి. తన తప్పులేంటో మరోసారి లెక్క చూసుకోవాలి. తరం మారింది. ట్రెండ్ మారింది. కొత్త తరహా దర్శకులు విజృంభిస్తున్నారు. పూరి పేరు చూసి థియేటర్లకు వెళ్లేంత సీన్ ఇప్పుడైతే లేదు. ఆ బ్రాండ్‌ని పూరి ఎప్పుడో పోగొట్టుకున్నాడు. పూరికి బ్రేక్ అవసరం. దాంతో పాటు… ఆకాష్‌ని మాస్ హీరోగా చూపించాలన్న తపనలోంచి కూడా బయటకు రావాలి. తనది ఇంకా చిన్న వయసే. మాస్ హీరో చేయాల్సిన కథల్ని తాను హ్యాండిల్ చేయలేడు. ఆ విషయం మెహబూబాతో అర్థమైపోయింది. అందుకే ఆకాష్‌కి తగిన కథని సిద్ధం చేసుకోవాలి. అది కూడా ఇప్పటి ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలి. ఫైటింగులు, భారీ యాక్షన్ జోలికి వెళ్లకుండా క్యూట్ లవ్ స్టోరీ చెప్పగలిగితే… పూరి హిట్టుకొట్టడమే కాదు, తనయుడికీ బ్రేక్ ఇవ్వగలడు. అయితే పూరి ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఓ కథని సిద్ధం చేశాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే హెవీ యాక్షన్ డోసు తప్పని సరి. ప్రస్తుతం పూరి ఆ కథని పక్కన పెట్టుకుంటే మంచిది. `పదేళ్లకు సరిపడా కథలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి` అని పూరి గొప్పగా చెప్పుకుంటుంటాడు. అందులో ఆకాష్‌కి సెట్టయ్యే లవ్ స్టోరీ ఎంచుకుంటే మంచిది. ఇదే పూరి తక్షణ కర్తవ్యం.