కరోనా – లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలూ ఇబ్బంది పడుతున్నాయి. షూటింగులు ఆగిపోవడమే కాదు, ఆఖరికి స్క్రిప్టుల్నికూడా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పూరి – విజయ్ దేవరకొండ సినిమాకీ ఈ సమస్య ఉంది.
పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. స్క్రిప్టు ప్రకారం ఓ సందర్భంలో కథానాయకుడు విదేశీ ఫైటర్లతో తలపడే కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అందుకోసం విదేశాల నుంచి ఫైటర్లని తీసుకొచ్చారు. వాళ్లతో కొన్ని సీన్లు కూడా తెరకెక్కించారు. లాక్ డౌన్కి ముందే… ఫైటర్లు విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లని మళ్లీ ఇండియా తీసుకురాలేరు. అందుకే ఆయా సన్నివేశాల్ని స్థానిక ఫైటర్లతో మళ్లీ రీషూట్ చేయాల్సివస్తోందట. ఫారెన్ ఫైటర్లని తలపించే వాళ్ల కోసం పూరి అన్వేషిస్తున్నాడు. ఒకవేళ వాళ్లు దొరక్కపోతే, ఆయా సన్నివేశాల్ని రీ రైట్ చేయాల్సివస్తోంది. దానికి కూడా పూరి సిద్ధంగానే ఉన్నాడని టాక్. ఒక్క పూరికే కాదు… విదేశీ టచ్ ఉన్న ప్రతీ సినిమాకీ ఈ ఇబ్బంది తప్పదు.
అన్నట్టు ఈ సినిమా కోసం ‘ఫైటర్’, ‘లైగర్’ అనే రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే.. ఈ సినిమా కి మరో కొత్త టైటిల్ దొరికిందట. ఆ టైటిలే ఖాయం చేశారని త్వరలోనే దాన్ని ప్రకటిస్తారని సమాచారం.