పూరి జగన్నాథ్ కెరీర్లో చాలా సూపర్ హిట్లు ఉన్నాయి. అయితే ఆ సినిమాలకు సీక్వెల్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఇస్మార్ట్ శంకర్ ని డబుల్ ఇస్మార్ట్‌గా తీశారు పూరి. అయితే అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి సీక్వెల్ కథ వండి వారుస్తున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ – పూరి జగన్నాథ్ కాంబోలో `గోలీమార్` సినిమా వచ్చింది. కమర్షియల్ గా ఓకే అనిపించిన సినిమా అది. ఇప్పుడు మరోసారి పూరి – గోపీచంద్ కలిసి పని చేయబోతున్నట్టు, అది ‘గోలీమార్’ సీక్వెల్ అని సమాచారం అందుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు టాక్.
‘డబుల్ ఇస్మార్ట్’ తరవాత పూరి చేయబోయే సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పెద్ద హీరోలతో పని చేద్దామంటే అందరూ ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. దాంతో అందుబాటులో ఉన్న హీరోతోనే ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకెళ్లాలని పూరి భావిస్తున్నారు. గోపీచంద్ కూడా బిజీనే. కాకపోతే.. గోపీ ఇప్పుడు మిగిలిన ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి పూరితో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పూరి దగ్గర కొత్త కథలకు కొదవ ఉండదు. ఆయన దగ్గర బౌండెడ్ స్క్రిప్టులు చాలానే ఉంటాయి. అలాంటప్పుడు సీక్వెల్ ఎందుకు తీయాల్సివస్తుందో? పైగా ‘డబుల్ ఇస్మార్ట్’ కలసి రాలేదు. ఇలాంటి తరుణంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సివచ్చిందో మరి!