డబుల్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్‌ని నాలుగు అడుగులు వెనక్కి లాగేసింది. ఈ సినిమా ఫ్లాప్‌తో.. పూరి మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు. ఎలాంటి సినిమా తీయాలి? ఈసారి ఏ జోనర్ టచ్ చేయాలి? అనే విషయంలో పూరి తర్జన భర్జనలు పడుతున్నాడు. సాధారణంగా ఓ ఫ్లాప్ వస్తే.. అందులోనే ఉండి, బాధపడిపోయే రకం కాదు పూరి. వెంటనే మరో సినిమా ప్రకటించేసి, ఆ సినిమా పనుల్లో పడిపోతాడు. ఎందుకంటే తన దగ్గర బౌండెడ్ స్క్రిప్టులు రెడీగా ఉంటాయి. కానీ.. ఈసారి మాత్రం కథ విషయంలో పూరి టైమ్ తీసుకొంటున్నాడు. పాత కథలన్నీ పక్కన పెట్టి, కొత్త కథ రాసుకోవాలనుకొంటున్నాడు. పూరి ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. తన టీమ్ తో తదుపరి సినిమాకు సంబంధించిన కసరత్తులు మొదలెట్టాడు. ప్రస్తుతం పూరి దృష్టి కథపైనే ఉందని, కథ ఫైనల్ అయ్యాకే, హీరో ఎవరన్నది తేలుతుందని టాక్.
పూరి ఎప్పుడు ఎలాంటి సినిమా తీసి సర్ప్రైజ్ చేస్తాడో ఎవరికీ తెలీదు. అందుకే పూరిని ఎవరూ లైట్ తీసుకోలేరు. పూరి కథ చెబుతానంటే వినే హీరోలు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి హీరోల విషయంలో పూరికి ఢోకా లేదు. ఎవరూ దొరక్కపోతే… కొత్తవాళ్లతో సైతం పూరి సినిమాలు తీయగలడు. అందుకే హీరోని దృష్టిలో ఉంచుకొని కథలు రాసే పద్ధతిని పూరి పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఇది పూరిలో కనిపిస్తున్న కొత్త మార్పు. ఒకరిద్దరి బాలీవుడ్ హీరోలు సైతం పూరికి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈసారి తెలుగులో సినిమా చేయడం లేట్ అయ్యేలా ఉంటే, బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసి, అప్పుడు తెలుగులో సినిమా తీసే అవకాశం ఉంది.