పూరి జగన్నాథ్ ఫటాఫట్ దర్శకుడు. కథ స్పీడుగా రాస్తారు. అంతే స్పీడుగా సినిమా తీస్తారు. ‘డబుల్ ఇస్మార్ట్’ తరవాత ఆయన చేయబోయే సినిమా ఏమిటన్నది ఇటీవలే ఫైనల్ అయ్యింది. విజయ్ సేతుపతితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశారు పూరి. ఇందులో టబు ఓ కీలక పాత్ర పోషించనున్నారు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంది. ఈ సినిమాని కేవలం 60 రోజుల్లో ఫినిష్ చేయాలన్నది పూరి ప్లాన్. ఎందుకంటే విజయ్‌సేతుపతి ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డెడ్ లైన్ ఇచ్చార్ట. ఆయన కూడా ఫుల్ బిజీ నటుడాయె. కథ నచ్చి చేతిలో ఉన్న సినిమాలన్నీ పక్కన పెట్టి పూరికి కాల్షీట్లు ఇచ్చారు. అందుకే.. పూరి కూడా విజయ్ కోసం త్వరగా ఈ సినిమాని క్లోజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తయ్యింది. డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్టు రెడీ అయ్యింది. షెడ్యూల్స్ వేసుకొని, సినిమాకు కొబ్బరికాయ్ కొట్టడమే తరువాయి.
ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కథ ప్రకారం ఇందులో విజయ్ ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నాడు. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ మురికి వాడ సెట్ అవసరం. అది చెన్నైలో వేయాలా? లేదంటే హైదరాబాద్ లో వేయాలా? అనే సందిగ్థం ఉంది. విజయ్ చేస్తున్న సినిమాలు, వాటికి ఇచ్చే కాల్షీట్లు ఇవన్నీ ఫైనల్ అయిన తరవాత సెట్ ఎక్కడ వేయాలి? అనేది డిసైడ్ అవుతారు. అన్నీ కుదిరితే ఈ యేడాది చివర్లోనే ఈ సినిమాని విడుదల చేస్తారు.