పూరిజగన్నాథ్ Vs డిస్టిబ్యూటర్ల వ్యవహారంలో ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ నోరు మెదుపుతోంది. నాలుగు గోడల మధ్య శాంతియుతంగా తేల్చుకోవాల్సిన అంశమని… దాన్ని పోలీసు స్టేషన్లూ, కేసులు అని రచ్చ చేసుకోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా. ”పంపిణీదారులకు డబ్బు తిరిగి ఇవ్వడం అన్నది నిర్మాత చూసుకోవాల్సిన వ్యవహారం.. దానికీ పూరి జగన్నాథ్ కీ సంబంధం ఏమిటి” అని అంటూనే… ”పూరి వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు ఒక వేళ పంపిణీదారులు పూరిపై దాడి చేసినా పూరి కేసు పెట్టడు. కానీ పోలీసు స్టేషన్ వరకూ వెళ్లడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింద”న్నారు. ”పూరి ఎక్కడికీ పారిపోడుగా.. మళ్లీ వస్తాడు.. అప్పుడు కూర్చుని ఈ వ్యవహారం సెటిల్ చేసుకోవొచ్చు. అప్పటి వరకూ అందరూ కాస్త కామ్‌గా ఉంటే మంచిది” అంటూ హితవు పలికారు తమ్మారెడ్డి.
పంపిణీదారులకు దాసరి నారాయణరావు నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కొంతమంది పంపిణీదారులు ఈరోజు ఉదయం దాసరిని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకొన్నారు. పంపిణీదారుల ప్రెస్ మీట్‌కి దాసరి కూడా రావాల్సింది. కానీ మరో దర్శకుడికి వ్యతిరేకంగా గళం విప్పడం దాసరికీ నచ్చక ఆయన తెర వెనుకే ఉండిపోయారని తెలుస్తోంది.