హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా ఆగిపోవటంపై పూరి జగన్నాథ్ వెర్షన్ ఎట్టకేలకు బయటకొచ్చింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న రాంచరణ్ ప్రకటించటం, దాని పేరును ఆటో జానీగా ప్రకటించటం తెలిసిందే. అయితే ఏమయిందో ఏమోగానీ ఆ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పట్టాలపైకెక్కలేదు. తర్వాత చరణ్, చిరంజీవి వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా పూరి ఈ ప్రాజెక్టులో లేనట్లే అని చెప్పారు. దానికి కారణాలను కూడా వివరించారు. పూరి ఫస్ట్ హాఫ్ వరకు చెప్పిన కథ బాగుందని, సెకండ్ హాఫ్ బాగోలేదని చెబితే వేరే వెర్షన్ చేసుకొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదని, వేరే ప్రాజెక్టులతో బిజీ అయినట్లున్నారని చెప్పారు. వారి వాదనలోకూడా కొంతమేర వాస్తవం ఉందనిపించింది. ఎందుకంటే చిరంజీవి ప్రాజెక్ట్ స్టోరీ ఖరారు కాకుండానే పూరి వేరే సినిమాలు అనేకం ప్రకటించేశారు. ఛార్మితో జ్యోతిలక్ష్మి, నితిన్‌తో ఒకటి, వరుణ్‌తేజ్‌తో ఒకటి ఇలా వరసగా ప్రకటించుకుంటూ పోవటం చిరు, చరణ్‌లను ఆగ్రహానికి గురిచేసింది. దానిని డైరెక్ట్‌గా చెప్పకుండా పూరి బిజీగా ఉన్నట్లున్నారని చెప్పారు.
ఆ సినిమా ఆగిపోవటంపై పూరి ఇవాళ వివరణ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా వివిధ మీడియా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, చిరంజీవిగారు కథ రెడీ చేయమన్నారని, ఫస్ట్ హాఫ్ ఆయనకు నచ్చిందని చెప్పారు. నాగబాబుగారికి చెప్పమంటే చెప్పానని తెలిపారు. ఆయనకుకూడా కథ బాగా నచ్చిందని చెప్పారు. దాంతో ఏమైనా కరెక్షన్స్ చెబుతారా అని చిరంజీవిగారిని అడిగానని, తర్వాత చెబుతానని అన్నారని తెలిపారు. కానీ, ఉన్నట్లుండి – సెకండాఫ్ నచ్చలేదని చిరంజీవి ఒకరోజు మీడియాతో చెప్పారని అన్నారు. దానికి బదులుగా చిరంజీవి – ఈ కరెక్షన్స్ చేస్తే బాగుంటుందని చెబితే తాను చేసేవాడినని చెప్పారు. తనవరకు తనకా కథ అద్భుతంగా ఉందని, చిరంజీవి డెసిషన్ తీసుకోలేదని అన్నారు. ఇప్పుడైనా చిరంజీవి పిలిచి సినిమా చేయమంటే చేయటానికి తాను రెడీ అని చెప్పారు. పూరి ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారని రాంచరణ్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ టెంపర్ తర్వాత నాలుగు సినిమాలు కమిట్ అయ్యానని, అప్పుడే చిరంజీవిగారు పిలిచి 150వ సినిమా గురించి అడిగారని, ఆయనపై గౌరవంతో రెండు సినిమాలకు రెండు కోట్లు అడ్వాన్స్ తీసుకునికూడా తిరిగి ఇచ్చేశానని అన్నారు. ఆ సినిమాలు క్యాన్సిల్ చేసేసినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు చిరంజీవికి కథ నచ్చలేదని, నిజానికి తాను బిజీగా ఉన్నపుడే చిరంజీవి తనను సినిమా చేసి పెట్టమని అడిగారని చెప్పారు.