ఇండస్ట్రీలో ‘నేనింతే’ టైపు వ్యవహారం దర్శకుడు పూరీది. ఆయనకు తోచినట్టు సినిమాలు తీస్తాడని పేరుంది. వరుస ఫ్లాప్ సినిమాలకు పూరి జగన్నాథ్ వైఖరి తప్ప మరో కారణం లేదని ఎంతోమంది ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించారు. డిజాస్టర్ మీద డిజాస్టర్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకొచ్చిన పేరుని నిలబెట్టుకోలేకపోయిన పూరి తీసిన తాజా సినిమా ‘మెహబూబా’. ఈ సినిమాతో పూరి కుమారుడు ఆకాష్ హీరోగా రీ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మూడేళ్ల కిందట ‘ఆంధ్రాపోరి’ సినిమా చేసినా… ‘మెహబూబా’ని హీరోగా ఇంట్రడక్షన్ ఫిల్మ్ అని చెబుతున్నారు. ఈ సినిమా కార్యక్రమాల్లో పూరి మాటలు గమనిస్తే ఆయనలో మార్పు ప్రేక్షకులకు సుస్పష్టంగా కనబడుతోంది. వాళ్ల చెవులకు చెవులకు వినబడుతోంది.
“సినిమా కథ రాసేటప్పుడు హీరో ఇంట్రడక్షన్ ఇలా వుండాలి, ఇక్కడ ఐటమ్ సాంగ్ పడాలి, ఫైట్స్ ఇక్కడ డిజైన్ చేయాలి, కమర్షియల్ ఎలెమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటుంటా. చాలా సినిమాలకు అలాగే రాశా. అటువంటి ఆలోచనలు లేకుండా జెన్యూన్‌గా సినిమా ‘మెహబూబా” – సినిమాలో ‘నా ప్రాణం’ పాట విడుదల కార్యక్రమంలో పూరి మాటలు. ఇక, మీడియా జనాలతో సంభాషణల్లోనూ ”ఇకపై నా నుంచి కొత్త సినిమాలు వస్తాయి. చూస్తుండండి. ఎవరి కోసమో కథలు రాయకుండా జెన్యూన్‌గా కథలు రాసి సినిమాలు తీస్తా” అంటున్నార్ట. తాజా ఇంటర్వ్యూలో “35 సినిమాలు తీసిన నేను, ఇంతవరకూ ‘మెహబూబా’ లాంటి ప్రేమకథను చేయలేదు. కొత్తగా వుంటుందీ సినిమా. ఈ సినిమా విడుదలైన ఏడాదిలోపు ఆకాష్‌తో ఇంకో రెండు సినిమాలు తీస్తా. అవీ కొత్తగానే వుంటాయి” అన్నారు పూరి.
విజయాలకు పూరి కొత్త సూత్రం కనిపెట్టారు. పరాజయాలకు కారణాలనూ విశ్లేషించారు. అదేంటంటే… బయట సంస్థల్లో సినిమాలు చేసినప్పుడు ఫ్లాపులు వస్తున్నాయన్నది పూరి ఎనాలసిస్. సొంత సంస్థలో సినిమాలు చేసిన ప్రతిసారి విజయాలు వస్తున్నాయని తేల్చేశారు. “పోకిరి, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి… నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ నా సంస్థల్లో తీసినవే” అని పూరి వ్యాఖ్యానించారు. ఇకపై బయట నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయడకూడదని, సొంతంగా తానే సినిమాలు నిర్మించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. బయట సంస్థల్లో చేస్తే కంఫర్ట్ మిస్ అవుతుందని పూరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మాటల్లో చాలా మార్పు కనబడుతోంది. ఈ మార్పు విజయ తీరాలకు చేరుస్తుందో? లేదో? పూరి జగన్నాథ్ వంటి స్టార్ దర్శకుడికి నిర్మాతలు ఏం ఆంక్షలు పెట్టగలరు? పెడతారు? ఆయన చెబుతున్నట్టు కంఫర్ట్ మిస్ అయ్యే ఛాన్సులు కనిపించడం లేదు.