హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న లోఫర్ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీని తర్వాత పూరి రోగ్ అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. కన్నడ, తెలుగు భాషలలో రూపొందే ఈ చిత్రంలో ఇషాన్ అనే కొత్త హీరోను, చిరుత సినిమాలో నటించిన నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ హీరోయిన్గా పూరి పరిచయం చేయబోతున్నారు. శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ చిత్రాన్ని నిర్మించిన సీఆర్ మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. హీరో ఇషాన్ నిర్మాత మనోహర్ కుమారుడే. డిసెంబర్లో రోగ్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. మరోవైపు ఈ చిత్రానికి పూరి రికార్డ్ స్థాయిలో రు.15 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు.
పూరి తన చిత్రాలకు నెగెటివ్ టైటిల్స్ పెట్టటం దాదాపు 2002లో వచ్చిన ‘ఇడియట్’తో ప్రారంభమయింది. ఆ చిత్రంలో రవితేజ హీరో. తర్వాత మహేష్‌తో ‘పోకిరి’ని రూపొందించారు. తర్వాత అల్లు అర్జున్‌తో ‘దేశముదురు’ తీశారు. ఆ సినిమాలన్నీ హిట్లే. తాజాగా వరుణ్ తేజ్‌తో రూపొందిస్తున్న ‘లోఫర్’ చిత్రం పేరును ‘మా అమ్మ మహాలక్ష్మి’ అని మారుస్తారని టాక్ వచ్చినప్పటికీ టైటిల్ కలిసొస్తుందనే సెంటిమెంటో, ఏమో మళ్ళీ మొదటి పేరునే ఖాయం చేశారు. మరి ఆ సెంటిమెంట్ ‘లోఫర్’, ‘రోగ్’కు పనిచేస్తుందో, లేదో చూడాలి.