డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేసింది. రోజుకొక్కరు సిట్ విచారణకు హాజరవ్వడం, అక్కడ నడిపిన హైడ్రామా.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. పూరి, ముమైత్, రవితేజ లాంటి సెలబ్రెటీలు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవడంతో మీడియాకు కావల్సినంత ఫుటేజీ దొరికినట్టైంది. ఈ విషయంలో మీడియా ఓవరాక్షన్ తనను హర్ట్ చేసిందని పూరి ఓ సందర్భంలోనూ చెప్పారు. అన్నట్టు ఈ టోటల్ ఎపిసోడ్‌పై ఆయనిప్పుడు ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకొంటున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్తయ్యింది. ”డ్రగ్స్ వ్యవహారం అప్పుడే మర్చిపోయా. అది నా దృష్టిలో ఒక్కరోజు వ్యవహారం. కేసు కాదు, ఏమీ లేదు. కేవలం విచారణ నిమిత్తం పిలిచారంతే” అంటూ క్లారిటీ ఇచ్చాడు పూరి. ఈ ఎపిసోడ్‌పై సినిమా తీసే ఆలోచన ఉందా అని అడిగితే.. ”అవును.. ఆ ఆలోచన ఉంది. అందుకు సంబంధించిన స్కిప్టు కూడా సిద్దమైంది” అన్నారు పూరి. అయితే.. ఆ సినిమా ఎప్పుడు తీస్తారో మాత్రం చెప్పలేదు. మొత్తానికి డ్రగ్స్ వ్యవహారాన్ని పూరి మళ్లీ కెలుకుతున్నట్టే కనిపిస్తోంది. ఆ కేసులో ఇరుక్కొన్న పూరి.. ఓ సినిమా తీస్తే.. అది నిజంగా సంచలనమే. సినిమా ఎలా ఉన్నా, ఓపెనింగ్స్‌కి ఢోకా లేదు. మరి ఈ కథని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.