సినీ పరిశ్రమలో సంపాదించిన ప్రతీ పైసాని మళ్లీ సినిమాలకే ఖర్చు పెట్టేవాళ్లు చాలా అరుదు. అలాంటి వ్యక్తుల్లో… పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో పూరి ముందుండేవాడు. ‘పోకిరి’ తరవాత.. పూరి రేంజు, క్రేజ్ డబుల్, ట్రిపుల్ అయ్యాయి. ఆ జోరుతో బాగా డబ్బులు వెనకేసుకున్న పూరి.. వాటిని మళ్లీ టాలీవుడ్‌కే ధారబోశాడు. సొంత బ్యానర్ లో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన తనయుడ్ని హీరోగా ప్రమోట్ చేస్తూ తీసిన ‘మెహబూబా’ కూడా భారీ నష్టాల్ని మిగిల్చింది. తన ఆస్తులలో కొంత భాగాన్ని అమ్ముకుని ఈ సినిమా తీసిన పూరి.. ఆ మేర నష్టపోవాల్సివచ్చింది.
ఇప్పుడు రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా మొదలెట్టాడు. ఈ సినిమాకి తనే నిర్మాత. పూరి – రామ్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో కాస్తో కూస్తో అంచనాలు ఉంటాయి. కానీ.. బయ్యర్లలో కాదు. ఈ సినిమా మొదలవ్వగానే బయ్యర్లు వరుస కడతారు, అడ్వాన్సులు ఇచ్చేస్తారు అనుకోవడం భ్రమ. ‘ఏం తీస్తాడో చూద్దాం..’ అన్నట్టే కామ్‌గా ఉంటారు. ఈ విషయం పూరికీ తెలుసు. అందుకే ప్రతీ పైసా తన జేబులోంచి తీసే పెడుతున్నాడు. తన ప్రతి సినిమాకీ ఏదో ఓ ప్రోపర్టీ అమ్మేయడం, సినిమా బాగా ఆడితే.. మళ్లీ ఏదోటి కొనడం పూరికి అలవాటు. ఈసారీ అదే స్టైల్లో వెళ్తున్నాడు. ”సినిమానే అన్నీ ఇచ్చింది. ఈ సినిమాకి అమ్ముకుంటే, మరో సినిమాకి కొంటాను. ఏం చేసినా ఇక్కడే” అని పూరి ఓ సందర్భంలో చెప్పాడు. సినిమాపై అంత కమిట్మెంట్ పూరికి కాక ఇంకెవరికి ఉంటుంది..?? దట్స్ పూరీ!!