పూరికి ఎట్టకేలకు ఓ హిట్టు దక్కింది. అది అలాంటిలాంటి హిట్టు కాదు. బాక్సాఫీసు దగ్గర మాస్‌ని ఊపేసే హిట్టు. తొలి రోజు వసూళ్ల రేంజు చూస్తే… ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ ఖాతాలో చేరిపోతోందేమో అనిపిస్తోంది. మరి పూరి తరవాతి స్టెప్ ఎప్పుడు? ఎవరితో..?? ఈ సినిమాతో పూరి ట్రాక్ ఎక్కేసినట్టేనా…?
ఎందుకైనా మంచిదని ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్, స్క్రిప్టు రెడీ చేసి పెట్టుకున్నాడు పూరి. అయితే ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనేది ఇస్మార్ట్ శంకర్ ఫలితాన్ని బట్టే అన్నది పూరికీ, రామ్కీ తెలుసు. అందుకే ఈమధ్య ఈ సినిమా సీక్వెల్ గురించి రామ్‌ని అడిగితే ‘ఇస్మార్ట్ శంకర్ హిట్టయితే సీక్వెల్ తప్పకుండా ఉంటుంది’ అని హింట్ ఇచ్చాడు. పూరీదీ అదే సమాధానం. ‘ఇస్మార్ట్ శంకర్’ రిజల్ట్ చూసిన తరవాత రామ్, పూరి తప్పకుండా సీక్వెల్‌పై దృష్టి పెట్టడం ఖాయం. పూరి దగ్గర ఆల్రెడీ స్క్రిప్టు ఉంది. రామ్ కూడా ఎలాంటి కమిట్మెంట్సూ పెట్టుకోలేదు. కాబట్టి ఈ సినిమా వెంటనే పట్టాలెక్కేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ రిజల్ట్ చూసి పూరి ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్క్రిప్టు పరంగా ఇందులో చాలా తప్పులున్నాయి. లాజిక్కులకు దూరంగా కథ రాసుకున్నాడు. రామ్ ఎనర్జీ, ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఈ సినిమాని నిలబెట్టాయి. ఆ విషయం పూరి తెలుసుకుని, సీక్వెల్లో కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిది.