రేప్.. ఈ మాట వింటుంటే… భారతావని హడలిపోతోంది. తొమ్మిది నెలల పసికందుని కూడా కామాంధులు వదలడం లేదు. ఆడపిల్ల తల్లిదండ్రులకు వాళ్లని ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో `రేప్`లపై జోకులు వేస్తూ.. దాన్నో కమర్షియల్ సీన్‌గా తీర్చిదిద్దితే ఏమనాలి? అది కచ్చితంగా దర్శకుడి బాధ్యతా రాహిత్యమే. `ఇస్మార్ట్ శంకర్`లో అదే కనిపించింది.
ఇందులో రామ్ నభా నటేషా వెంట పడతాడు. ఓ అర్థరాత్రి ఆటో ఎక్కిన నభాని అల్లరి చేస్తాడు. రోడ్డు మీద పరిగెట్టించి పరిగెట్టించి ఇంటి వరకూ వెళ్లిపోతాడు. చివరికి బెడ్ రూమ్‌లో కూడా దూరిపోతాడు. మంచం ఎక్కి.. ఆపై నభా పైకెక్కి నిన్ను రేప్ చేస్తా అంటాడు. నభా పోలీసులకు ఫోన్ చేస్తుంది. నన్ను రేప్ చేస్తున్నాడు కాపాడండి అంటూ మొర పెట్టుకుంటుంది. పోలీసులు ఆఘమేఘాల మీద పరిగెట్టుకొస్తారు. ఈలోగా రామ్ – నభాల మధ్య కెమిస్ట్రీ కుదిరిపోతుంది. ఇప్పుడు నభానే రామ్ పైకి ఎక్కుతుంది. ఈలోగా పోలీసులు వస్తారు. తలుపులు బద్దలుకొట్టుకుని లోపలకు వెళ్తామనుకుంటే `మా మధ్య డీల్ కుదిరిపోయింది.. మీరెళ్లిపోవొచ్చు` అన్నట్టు మాట్లాడుతుంది హీరోయిన్.
ఇది పక్కాగా మాస్ కోసం పూరి తీసిన సీన్. సరదాకో. నవ్వులాటకో, కామెడీ కోసమో, హీరో- హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టించడానికో ఈ సీన్ తీశాడనుకోవొచ్చు. కానీ… దాన్ని చూపించే పద్ధతి మాత్రం కచ్చితంగా ఇది కాదు. `రేప్ చేస్తున్నాడు రండి` అని పోలీసుల్ని పిలిపించి – వాళ్లొచ్చినప్పుడు మా మధ్య అండర్ స్టాండిగ్ కుదిరిపోయిందని చెప్పి తిరిగి పంపించడం ఏమిటి? ఇది కామెడీ అనుకోవాలా? రేప్‌ని పూరి చూసే కోణం ఇదేనా? ఎంత హీరో అయినా.. ఓ అమ్మాయి వెంట పడి, రేప్ చేస్తా అని బెదిరిస్తుంటే దాన్ని కూడా హీరోయిజం అనుకుని తప్పట్లు కొట్టి, మురిసిపోవాలా? పోలీసుల్ని మరీ ఇలా వెర్రి వెంగళప్పలుగా చూపించాలా? సినిమాలో లాజిక్కులు ఉండవు. అన్నీ మ్యాజిక్కులే. అలాగని ప్రతీదీ ఓ మ్యాజిక్‌గా తీసుకోవడానికి వీల్లేదు. సున్నితమైన సమస్యల గురించి చెబుతున్నప్పుడు, దాన్ని తెరపై చూపించాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? పైగా పూరి ఏమైనా కొత్త కుర్రాడా, వేడి రక్తంలో అలాంటి సీన్ రాసేశాడనుకోవడానికి..?? ఇలాంటి విషయాల్లోసెన్సార్ బోర్డు కాస్త కఠినంగా వ్యవహరిస్తేనే మంచిదేమో..??