‘పుష్ష 2’ రికార్డుల వేట మొదలైంది. మొన్నటికి మొన్న ‘పుష్ష 2’ హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వచ్చాయి. ఆడియో రైట్స్ విషయంలోనూ పుష్ష దే రికార్డు. ఏకంగా రూ.65 కోట్లకు టీ.సిరీస్ సంస్థ చేజిక్కించుకొంది. ఇప్పుడు ఓటీటీ పరంగానూ పాత రికార్డులన్నీ ‘పుష్ష 2’ తిరగరాసేసింది. ‘పుష్ష 2’ ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ రూ.275 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇది ఆల్ టైమ్ రికార్డ్! ఇది వరకు ‘ఆర్.ఆర్.ఆర్’ రైట్స్ రూ.200 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ రికార్డ్ ఇప్పుడు ‘పుష్ష 2’ చెరిపేసింది.
కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.500 కోట్ల పైచిలుకు సంపాదించేసింది. ‘పుష్ష 2’కి రూ.450 కోట్ల బడ్జెట్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వడ్డీలకూ, ప్రమోషన్లకూ మరో రూ.50 కోట్లు అనుకొన్నా.. రూ.500 కోట్ల లెక్క తేలింది. అదంతా నాన్ థియేట్రికల్ నుంచే వచ్చేసిందంటే.. ఇక థియేటర్ నుంచి వచ్చేదంతా లాభమే అనుకోవాలి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్రబృందం ముందే ప్రకటించింది. అనుకొన్న సమయానికి సినిమాని సిద్ధం చేయాలని దర్శకుడు సుకుమార్ అహర్నిశలూ కష్టపడుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.