కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఫ్యాన్స్ షోలకు అనుమతులు దొరకలేదు. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి పాలనలో బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలకు అనుమతులు వస్తున్నాయి. రేట్లు పెంచుకొనే అవకాశాలూ ఉన్నాయి. ‘దేవర’, ‘పుష్ప 2’లకు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేసుకొన్నారు నిర్మాతలు. దాంతో లాభాలూ ఆర్జించారు. అయితే ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు చెక్ పెట్టబోతోంది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. దానికి పుష్ప 2నే కారణం.
బుధవారం రాత్రి 9.30 నిమిషాలకు పుష్ప 2 ప్రీమియర్లు పడ్డాయి. అన్ని చోట్లా షోలు సవ్యంగానే నడిచాయి. అయితే ఆర్.టీ.సీ. క్రాస్ రోడ్స్ దగ్గర అభిమానుల గలాటా జరిగింది. అల్లు అర్జున్ సంథ్య థియేటర్‌కి వస్తున్నాడని తెలియగానే అభిమానులు పోటెత్తారు. ఆర్.టీ.సీ క్రాస్ రోడ్స్ మొత్తం కిక్కిరిసిపోయింది. జనాల తోపులాట మొదలైంది. దాంతో ఓ అభిమాని మృతి చెందాడు. కొందరు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది.
ఈ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై పడే అవకాశం ఉంది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిపై మంచి బజ్ ఉంది. సంక్రాంతి సీజన్ కాబట్టి, ప్రీమియర్లతో హడావుడి చేద్దామనుకొన్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేనట్టే. ఆంధ్రాలో ప్రీమియర్లకు అనుమతి ఇస్తే ఇవ్వొచ్చు. లేదంటే ముందు జాగ్రత్త చర్యగా అక్కడి ప్రభుత్వం కూడా `నో` చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.