పాట్నాలో ఓ తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ అన్నది నిన్నా మొన్నటి వరకూ పెద్ద జోక్. మన సినిమాల్ని అక్కడ ఎవరైనా పట్టించుకొంటారా? అనుకొనేవారు. కానీ `పుష్ప 2` ఈవెంట్, దానికి వచ్చిన స్పందన చూశాక… అసలు మన సినిమా ఏ స్థాయికి వెళ్లిపోయిందో అనేంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. దాదాపు 2 లక్షల మంది.. ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. మైదానం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అది పాట్నానా? పాలకొల్లా? అనేంత సందేహం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ ఈవెంట్ నిర్వహించినా, ఇంతకంటే జనసందోహాన్ని చూడలేమేమో? పాతిక వేల పాసులు చిత్రబృందం అభిమానులకు అందిస్తే – దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. పాస్‌లను బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టు అమ్మారు. బన్నీ వచ్చే దారంతా అభిమానులు అభివాదాలు చేస్తూనే కనిపించారు. ఇలాంటి దృశ్యాలు పాట్నాలాంటి ప్రదేశంలో ఓ తెలుగు సినిమాకు దక్కడం నభూతో.
ఈవెంట్ కూడా పక్కా ప్లానింగ్ తో సాగింది. సరిగ్గా 6 గంటలకే బన్నీ వేదిక దగ్గరకు వచ్చేశాడు. 6 గంటల 6 నిమిషాలకు ట్రైలర్ విడుదలైంది. గంటన్నరలో ఈవెంట్ ముగిసింది. ఇంత క్రౌడ్ వచ్చినా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కపోవడం అభినందించదగిన విషయం. అయితే బన్నీ, రష్మికల స్పీచులు చప్పగా సాగాయి. బన్నీ ఎప్పుడు మాట్లాడినా వైరల్ కంటెంట్ బయటకు వస్తుంది. కానీ ఈసారి హిందీలో డైలాగులు చెప్పడం మినహా.. వేదికపై తాను మాట్లాడింది లేదు. రష్మిక కూడా అంతే. సినిమా గురించి కానీ, దర్శకుడు గురించి కానీ ఏం చెప్పలేదు. నిర్మాతల స్పీచ్‌లు కూడా ముక్తసరిగానే ఉన్నాయి. బహుశా.. వీళ్లంతా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం తమ స్పీచ్‌లను అట్టి పెట్టుకొన్నారేమో. వర్క్ లోడ్ వల్ల సుకుమార్ ఈవెంట్ కు రాలేదు. దేవిశ్రీ వచ్చినా ఆ కిక్ వేరేలా ఉండేది.
మొత్తానికి ఈవెంట్ సూపర్ హిట్ అయ్యింది. నార్త్ లో ఓ తెలుగు సినిమా కోసం ఇంత పెద్ద స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం, దానికి ఈస్థాయిలో స్పందన రావడం బాలీవుడ్ కూడా కుళ్లుకునేలా ఉంది. పుష్ప 2 ప్రమోషన్లకు ఇది ఘనమైన శ్రీకారం. దేశ వ్యాప్తంగా పుష్పకు సంబంధించి మరిన్ని ఈవెంట్లు జరగబోతున్నాయి. వాటికీ ఇలాంటి ఆదరణే దక్కే అవకాశం ఉంది.