2021 డిసెంబరు 17న పుష్ష విడుదలైంది. పార్ట్ 2ని 2022 డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఆ తరవాత 2024 ఆగస్టు 15న అంటూ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్నారు. అంటే ఈ బండి రెండేళ్లు ఆలస్యంగా నడుస్తోందన్నమాట. ఆగస్టు 15న కూడా ఈ సినిమా రావడం కష్టమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మొన్నామధ్యే మరో 200 రోజుల్లో పుష్ష 2 రాబోతోందంటూ చిత్రబృందం ఇంకోసారి గట్టిగా నొక్కి వక్కాణించింది. దాంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకొన్నారు.
ఆగస్టు 15న ఈ సినిమా తీసుకురావడం అనుకొన్నంత సులభం కాదు. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా వరకూ ఉంది. పుష్ష 1 విడుదలకు ముందు చాలా టెన్షన్ అనుభవించింది చిత్రబృందం. చివరి నిమిషం వరకూ ఫస్ట్ కాపీ రెడీ అవ్వలేదు. అలాంటి లాస్ట్ మినిట్ టెన్షన్లు పుష్ష 2కి ఉండకూడదని, ఈ సినిమాని చాలా ప్లాన్ గా తీర్చిదిద్దుతూ వచ్చారు. ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తే, పోస్ట్ ప్రొడక్షన్‌కి కావాల్సినంత సమయం దొరుకుతుందని, పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి సైతం వీలు ఉంటుందని చిత్రబృందం ఫిక్సయ్యే.. ఆగస్టు 15న బెర్త్ కన్ఫామ్ చేసుకొంది. అయితే పుష్ష 1 లానే పుష్ష 2కీ లాస్ట్ మినిట్ తలనొప్సులు తప్పేట్టు లేవు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా చాలా ఉంది. సుకుమార్ అసలే మిస్టర్ పర్ఫెక్ట్ టైపు. ప్రతీ సన్నివేశాన్నీ ఆచి తూచి చెక్కుతూ ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా కేశవ పాత్రధారి జగదీష్ ఓ కేసు గొడవలో చిక్కుకొన్నాడు. తనది పుష్ష 2లో కీలకమైన పాత్ర. తనపై భారీ ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. తను షూటింగ్ కి ఎంత వరకూ అందుబాటులో ఉంటాడన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అందుకే.. ఇప్పటి నుంచీ చిత్రబృందానికి ప్రతీ రోజూ, ప్రతీ గంటా కీలకమే. ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకొంటూ వెళ్తే, మే నాటికి షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చోవొచ్చు. అందుకే… పుష్ష టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఓ వైపు షూట్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, సీజీ అంటూ చాలా పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. ఇదంతా ఆగస్టు 15 మిస్ అవ్వకూడదనే.