దేశమంతా ‘పుష్ప 2’ ఫీవర్ పాకేసింది. ట్రైలర్ వచ్చాక, పాట్నాలో ఈవెంట్ చూశాక ఈ హైప్ మరింత పెరగడం ఖాయం. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని మైత్రీ మూవీస్ సంస్థ భావిస్తోంది. అందుకోసం ఓ వినూత్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతీ థియేటర్లోనూ ఫస్ట్ డే.. ఫస్ట్ షో టికెట్‌ని వేలం పద్ధతి ద్వారా అమ్మకానికి పెట్టాలనుకొంటోంది మైత్రీ. ఆంధ్రా, తెలంగాణలలో దాదాపు 2వేల థియేటర్లలో తొలి టికెట్ ని వేలం వేసే అవకాశం ఉంది. దాని ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయం రాబోతోంది. ప్రీమియర్ల టికెట్ ఎలాగూ రూ.1000లకు పైమాటే. కాబట్టి ఎటు చూసినా, తొలి రోజు వసూళ్లలో ఆర్.ఆర్.ఆర్ రికార్డుల్ని బ్రేక్ చేయాలని భావిస్తోంది. తొలి రోజు ఆర్.ఆర్.ఆర్ దేశ వ్యాప్తంగా దాదాపుగా రూ.220 కోట్లు వసూలు చేసింది. పుష్ప క్రేజ్ ఇలానే కొనసాగితే, వేలం పద్ధతి వర్కవుట్ అయితే ఈ అంకెల్ని చేరడం ఏమాత్రం కష్టం కాదు.
తమిళనాడు, కేరళతో పాటు దక్షిణాదిన పుష్పకు ఎక్కువ థియేటర్లు దొరకబోతున్నాయి. తమిళనాట రజనీకాంత్, విజయ్ చిత్రాల తొలి రోజు వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా కలక్షన్లు రావొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కేరళలోనూ మంచి సంఖ్యలో థియేటర్లు బ్లాక్ చేస్తున్నారు. నార్త్ లోని ప్రతి చిన్న టౌన్కీ పుష్ప వెళ్లేలా డిస్టిబ్యూటర్లు జాగ్రత్త తీసుకొంటున్నారు. వీలైనంత వరకూ అన్నిచోట్లా ప్రీమియర్లు వేయాలన్నది ప్లాన్. అందుకోసం మైత్రీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్లాన్ అంతా అనుకొన్నది అనుకొన్నట్టు వర్కవుట్ అయితే – కచ్చితంగా తొలి రోజు వసూళ్లలో ‘ఆర్.ఆర్.ఆర్’ని దాటేయడమే కాదు, సినిమా హిట్టయితే ‘బాహుబలి 2’ రికార్డుల్నీ బ్రేక్ చేసే సత్తా.. పుష్పకు ఉంది.