‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత సినిమా అభిమానులు అంతగా ఎదురు చూసిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘పుష్ప 2’ మాత్రమే! ‘పుష్ప’ సమయంలో ఇంత బజ్ లేదు. విడుదలయ్యాక… కాస్త డివైడ్ టాక్ నడిచింది. ఓ దశలో సినిమా ఫ్లాప్ అన్నారు. కానీ… నార్త్ లో ‘పుష్ప’ ప్రభంజనం సృష్టించింది. అక్కడి మాస్ ప్రియులు ‘పుష్ప’ని బ్లాక్ బస్టర్ చేశారు. దాంతో ‘పుష్ప 2’పై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే సుకుమార్ చాలా టైమ్ తీసుకొని చేసిన ప్రాజెక్ట్ ఇది. దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. అల్లు అర్జున్ కూడా మరే సినిమా ఒప్పుకోకుండా కేవలం ‘పుష్ప’ కోసమే టైమ్ కేటాయించాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అంకెలు దిమ్మతిరిగేలా చేశాయి. దేశ వ్యాప్తంగా బడా డిస్టిబ్యూటర్లు ఈ సినిమా కోసం పోటీ పడ్డారు. ప్రీమియర్ షోలకూ, టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. బెనిఫిట్ టికెట్ రేటు చూసి ‘మరీ ఇంతా’ అంటూ నోరెళ్లబెట్టారంతా. మరో వైపు మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక ఏర్పడింది. బన్నీ సినిమాని చూసేది లేదంటూ ఓ వర్గం నిరసన జెండా ఎగరేసింది. ఇన్ని ఆశలు, అంచనాలు, ఒత్తిళ్ల మధ్య ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి… ‘పుష్ప’పై ఉన్న అంచనాల భారాన్ని అల్లు అర్జున్, సుకుమార్‌లు ఎలా మోశారు? ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తి పరిచారు? టికెట్ రేట్లు గిట్టుబాటు అయ్యాయా, లేదా?
ఎర్రచందనం కూలీ నుంచి సిండికేట్ కింగ్‌లా ఎదిగిన పుష్ప (అల్లు అర్జున్) ఎప్పటిలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అధికార పార్టీకి సైతం భారీగా ఫండ్ పంపిస్తుంటాడు. ఓసారి.. సీఎమ్ ని కలిసి వద్దామని బయల్దేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ ఓ చిన్న కోరిక కోరుతుంది శ్రీవల్లి (రష్మిక). ‘సీఎంతో ఫొటో ఎంతసేపూ?’ అనుకొన్న పుష్పకి సీఎం పేషీలో ఎదురు దెబ్బ తగులుతుంది. స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే, ఫొటోలు తీసుకోవడానికి కాదు.. అంటూ సీఎమ్ నిరాకరిస్తాడు. దాన్ని పెద్ద అవమానంగా తీసుకొంటాడు పుష్ప. దాంతో ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు కావాలి. ఆ రూ.500 కోట్ల కోసం రెండు వేల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్ ని ఆపడానికి భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజల్) శతవిధాలా ప్రయత్నిస్తాడు. మరి… భన్వర్ సింగ్ షెకావత్ ని దాటుకొని పుష్ప ఆ రెండు వేల టన్నుల సరుకు స్మగ్లింగ్ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకొన్నాడు? ఇంటిపేరు కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అనేది మిగిలిన కథ.
పుష్ప 2లో పెద్దగా కథేం లేదు. ఆ మాటకొస్తే.. సుకుమార్ కూడా కథపై పెద్దగా ధ్యాస పెట్టినట్టు కనిపించలేదు. కానీ ఇక్కడ సుక్కు నమ్ముకొంది కథ కంటే.. పుష్ప అనే క్యారెక్టర్‌ను. పార్ట్ 1తోనే ఆ పాత్ర ప్రేక్షకుల్లోకి ఎక్కేసింది. ఇప్పుడు అదే పాత్రని మరింత ఎలివేట్ చేస్తూ, పుష్ప రాజ్ నట విన్యాసానికి దారిస్తూ సన్నివేశాలు రాసుకొంటూ వెళ్లిపోయాడు. ఆ సీన్లు ఎంత బలంగా పని చేశాయంటే.. సుకుమార్ ఈ సినిమాలో కథేం చెప్పడం లేదు అనే నిజాన్ని కూడా ప్రేక్షకుడు గ్రహించలేడు.
జపాన్ ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది. జపాన్‌లో హీరో ఎలివేషన్లలో సాగే ఫైట్ చాలా నార్మల్ గా, రెగ్యులర్‌గా అనిపిస్తుంది. 40 రోజుల పాటు నీళ్లూ, ఆహారం లేకుండా పుష్ప ఓ కంటైనర్‌లో జపాన్ వరకూ రావడం, దిగీ దిగగానే వందమంది ఫైటర్లని తుక్కు తుక్కుగా కొట్టేయడం ఇదంతా మాస్ మసాలా వ్యవహారంలా అనిపిస్తుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. పుష్ప బాల్యంలో పడిన అవమానాల్ని చూపిస్తూ ఓ సీన్ రాసుకొన్నాడు. ఆ తరవాత.. కథలో మరో జర్క్. ఇదంతా చూసి ‘ఏంటి… సుకుమార్ మొదట్లోనే దారి తప్పినట్టు ఉన్నాడు’ అనే కంగారు వేస్తుంది. కానీ ఆ తరవాత క్రమంగా గాడిలో పడ్డాడు. పోలీస్ స్టేషన్లో ‘ఇది పుష్పగాడి రూలు..’ అని డిక్లేర్ చేసినప్పటి నుంచీ అసలైన జాతర మొదలవుతుంది. ప్రతీ సీన్‌ని సుకుమార్ చాలా నార్మల్ గా, రెగ్యులర్‌గా మొదలెట్టాడు. కానీ దాన్ని ముగించే తీరు దగ్గర మాత్రం మెస్మరైజ్ చేసేస్తాడు. అక్కడ సుక్కు మార్క్ కనిపిస్తుంది. ఉదాహరణకు.. సీఎమ్‌తో ఫొటో సీన్. దాన్ని చాలా సాదా సీదాగా మొదలెట్టి.. ‘ఇంత రొటీన్‌గా రాసుకొన్నాడేంటి’ అని ఫీలయ్యేలోగా సుకుమార్ మార్క్ బయటకు వస్తుంది. అక్కడ ఎలివేషన్లు పడతాయి. రెండో సీన్‌కి దోవ దొరుకుతుంది. సీను తరవాత సీను.. సీను తరవాత సీను… ప్రతీ చోటా హీరో ఎలివేషన్లే. అవన్నీ ఫ్యాన్స్ కు బాగా నచ్చేస్తాయి. మధ్యలో సుకుమార్ చేసిన మంచి పని… శ్రీవల్లీ పాత్రని బాగా డిజైన్ చేసుకోవడం. ‘ఎంత పుష్పగాడైనా ఇంట్లో పెళ్లాం వండిన కూర బాగోలేదని చెప్పకూడదు’ అనే డైలాగ్ చిన్నదే కావొచ్చు. కానీ భార్యా భర్తల ఎమోషన్ని, వాళ్ల బంధాన్ని సూచిస్తుంది. పెళ్లాం దగ్గర చిన్న పిల్లాడైపోయిన పుష్పని కుటుంబ ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ‘పీలింగ్స్’ మాటని బాగా క్వాయినింగ్ చేసుకొని, వాటి చుట్టూ రొమాంటిక్ సీన్లు నడిపాడు. అవన్నీ ‘పుష్ప 1’లో వాన్ సన్నివేశం లా కాకుండా చాలా పద్ధతిగానూ అందంగానూ సాగాయి. మధ్యమధ్యలో పాటలు, అందులో బన్నీ స్టెప్పులతో తొలిసగంలో ఎక్కడా కంప్లైంట్ లేకుండా సాగిపోతుంటుంది. ఇలాంటి చోట.. ఓ ఎమోషన్, ఎలివేషన్ మిక్స్ చేసిన ఇంట్రవెల్ బ్యాంగ్ కావాలి. అది కూడా పక్కాగా డిజైన్ చేసుకొన్నాడు సుకుమార్. ఇంట్రవెల్ దగ్గర పుష్పగా బన్నీ నటన… పీక్స్ లో సాగింది. ఆ క్యారెక్టర్లో జర్కులు కూడా అందంగా కుదిరాయి. పుష్ప షెకావత్‌కు సారీ చెబుతాడా, చెబితే ఏంటి? చెప్పకపోతే ఏంటి? అనే మీమాంశ ప్రేక్షకుల్లో, చుట్టు పక్కల ఉన్న పాత్రల్లో కల్పించాడు. ఆ సీన్‌ని మొదలెట్టిన తీరు, ముగించిన పద్ధతి చాలా మెస్మరైజింగ్ గా సాగాయి.
ఏ సినిమాకైనా సెకండాఫ్ చాలా కీలకం. అక్కడ సినిమాని నిలబెట్టే.. ఎపిసోడ్లు రెండో మూడో కావాలి. ఆ మూడు ఎపిసోడ్లు ఇవ్వాల్సిన కిక్ ‘జాతర’ ఇచ్చేసింది. జాతర ఎపిసోడ్ గురించి ముందు నుంచీ చాలా చర్చ నడిచింది. సినిమాలో ఈ సీన్ దాదాపు 30 నిమిషాలు ఉంటుందని, అందుకోసం బాగా ఖర్చు పెట్టారని చెప్పుకొన్నారు. అయితే ఈ ఎపిసోడ్ 30 నిమిషాల్లా అనిపించదు. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిందో తెలీదు. అంతలా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసిన ఎపిసోడ్ అది. జాతర పాటలో బన్నీ నటించలేదు. విశ్వరూపం చూపించాడు అనేది చాలా చిన్న మాటగా అనిపిస్తుంది. పాటలో బన్నీ ఎక్స్ప్రెషన్స్, ఆడిన తాండవం… ‘న భూతో’ అనుకోవొచ్చు. మరో పదేళ్ల పాటు ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకొనేలా బన్నీ నటన సాగింది. ఈ ఎపిసోడ్ ఓ హై పాయింట్ తో మొదలవుతుంది. అలాంటప్పుడు ఆ ఎపిసోడ్ ముగించడం చాలా కష్టం. కానీ ఇక్కడ సుకుమార్ లోని స్క్రీన్ ప్లే మాస్టారు బయటకు వచ్చాడు. శ్రీవల్లిని తీసుకొచ్చి.. ఎమోషనల్ సీన్‌తో హై ఎండ్ ఇచ్చాడు. జాతర ఎపిసోడ్ లో బన్నీ నటనకు ఎన్ని మార్కులు పడతాయో, శ్రీవల్లీ గా రష్మిక నటనకూ అన్నే మార్కులు పడతాయి. ఇలా ఓ ఎపిసోడ్ మొత్తం హీరో, హీరోయిన్లు పోటీ పడి నటించడం.. తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించే దృశ్యం.
సిద్దప్ప సీఎమ్ అవ్వగానే కథ ముగిసిపోవాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే… పుష్ప జర్నీ మొదలైంది సిద్దప్పని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాదు. తన ఇంటి పేరు దక్కించుకోవడం కోసం. అందుకే… క్లైమాక్స్ ని కాస్త ఎక్స్టెన్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ ప్రయాణం కాస్త ల్యాగ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ పుష్ప ప్రయాణానికి ఓ నిండుతనం రావాలంటే ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్సే కావాలి. క్లైమాక్స్ ఫైట్ కమర్షియల్ లెక్కల్లో సాగేదే. కాకపోతే మాస్‌కి నచ్చుతుంది. అక్కడ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్.ఆర్.. ఆ సీన్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. షెకావత్ పాత్రని ముగించిన తీరు అంత సంతృప్తిగా అనిపించదు. పార్ట్ 1తో పోలిస్తే ఈసారి ఈ పాత్రకు ఎక్కువ స్కోప్ దొరికింది. కాకపోతే.. అక్కడక్కడ ఈ పాత్రని జోకర్ గా చూపించడం వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది. ముఖ్యంగా షెకావత్, పుష్ప ఇద్దరూ మూగ సైగలు చేసుకొనే సీన్. అది చూడ్డానికి ఫన్నీగా ఉండొచ్చు. కానీ అక్కడ షెకావత్ లోని క్రూరత్వం పక్కదారి పట్టింది.
పుష్ప 1 కోసం అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు. బన్నీ అవార్డుకు అర్హుడేనా? అనే పాయింట్ తో డిబేట్ జరిగింది. అయితే పుష్ప 2 చూస్తే.. ఆ అనుమానాలు పటాపంచలైపోతాయి. బన్నీ జాతీయ అవార్డుకు అర్హుడే అనిపించేలా సాగింది తన నటన. ఐదేళ్ల పాటు పుష్ప పాత్రలో ఉండిపోయాడు బన్నీ. ఆ ఇంపాక్ట్ పార్ట్ 2లో ఇంకా బాగా కనిపించింది. ప్రతీ సీన్లోనూ… బన్నీ నటన పీక్స్‌లోకి వెళ్లిపోయింది. ‘ఈ సీన్లో చాలా బాగా చేశాడ్రా’ అనుకొనేలోగా మరో సీన్లో దాన్ని బీట్ చేసేశాడు. ఆఖరికి శ్రీవల్లీతో రొమాంటిక్ సీన్లోనూ.. చాలా అందంగా, చలాకీగా… ఒదిగిపోయాడు. బన్నీలోని ది బెస్ట్ చూసే అవకాశం ఇచ్చిన సినిమా ఇది. ఈ పాత్ర ప్రభావంలోంచి బయటకు రావడానికి బన్నీకి కూడా చాలాకాలం పడుతుంది. శ్రీవల్లీ ని తక్కువ చేయలేం. తనదైన అవకాశం వచ్చిన ప్రతీసారీ.. రష్మిక తనని తాను నిరూపించేసుకొంది. పార్ట్ 1తో పోలిస్తే, పార్ట్ 2లోనే ఆపాత్ర గుర్తిండిపోతుంది. షెకావత్ గా ఫహద్ ఫాజిల్ తనదైన మార్క్ చూపించాడు. కానీ ఆ పాత్రని ముగించిన తీరు అంతగా నప్పలేదు. సునీల్, అనసూయ పాత్రల్నీ సరిగా వాడుకోలేదేమో అనిపించింది.
టెక్నికల్‌గా హై స్టాండర్డ్ లో ఉంది సినిమా. మైత్రీ పెట్టిన ప్రతీ రూపాయీ తెరపై కనిపించింది. ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంతెంత కష్టపడ్డారో అర్థం అవుతూనే ఉంది. ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతంగా కుదిరింది. ప్రతీ సీన్‌ని కొరియోగ్రఫీ చేసినట్టు ముచ్చటగా తీశారు. దేవిశ్రీ పాటలు ప్లస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా ఎక్కడా తగ్గలేదు. సుకుమార్‌లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ ఓ కమర్షియల్ సినిమాని పక్కా మీటర్ లో తీస్తే ఎలా ఉంటుందో ‘పుష్ప 2’ చూస్తే అర్థం అవుతుంది. సీన్‌ని డిజైన్ చేసుకొన్న పద్ధతి అందరికీ నచ్చేస్తుంది. కథేం లేదు కదా, అనే ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు సుకుమార్. మూడు గంటల 20 నిమిషాల సినిమా ఇది. ఎక్కడ టెంపో డ్రాప్ అయినా విసుగొస్తుంది. ఆ ప్రమాదం ఉండి కూడా… సినిమాని, తాను రాసుకొన్న సీన్లని నమ్మి 200 నిమిషాల సినిమాని వదిలేశాడు సుకుమార్. ఆ నమ్మకం వమ్ము కాలేదు. పుష్ప 1 డివైడ్ టాక్ తో మొదలై, పాన్ ఇండియా వ్యాప్తంగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పుష్ప 2కి డివైడ్ టాక్ ఉండకపోవొచ్చు. ఎలివేషన్లతో సుకుమార్ కడుపు నింపేయడం, అల్లు అర్జున్ నట విన్యాసం ముందు ఎన్ని లోటు పాట్లు ఉన్నా అవన్నీ గాల్లో కలిసిపోతాయి. అసంతృప్తుల మధ్య పుష్ప 1 అంత పెద్ద హిట్ అయితే.. పుష్ప 2 ఏ స్థాయికి వెళ్తుందో ఇప్పుడే ఊహించడం కష్టం. బాలీవుడ్ వాళ్లు కూడా పుష్సని ఓన్ చేసుకొంటే తెలుగు చిత్రసీమ చూసిన అతి పెద్ద విజయాల్లో పుష్ప 2 ఒకటిగా నిలిచిపోవడం ఖాయం.
Pushpa 2 The Rule Movie Review Rating : 3.25/5
— అన్వర్..