శుక్రవారం వచ్చిందంటే సినీ అభిమానులకు పండగే. కొత్త సినిమాలు ఏం వచ్చాయో చూసుకొని, ఓ లుక్కేయడం అలవాటు. వీకెండ్ థియేటర్లు బిజీగా ఉంటాయి. ఈవారం కూడా చాలా సినిమాలొచ్చాయి. మెకానిక్ రాకీ, జీబ్రా, దేవకీ నందన వాసుదేవ, కేసీఆర్… ఇలా నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. రాకీ, జీబ్రాలకైతే ప్రీమియర్లు కూడా వేశారు. అయితే శుక్రవారం వీటిలో ఒక్క సినిమాకీ సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. థియేటర్లు దాదాపుగా ఖాళీ. మార్నింగ్ షోలే కాదు, రాత్రి ఆటలకూ ఇదే పరిస్థితి.
రాకీ, జీబ్రాలు తమ సినిమాల్ని బాగానే ప్రమోట్ చేశాయి. విశ్వక్సేన్ కి మాస్ లో మంచి గుర్తింపు ఉంది. కనీసం బీ,సీ సెంటర్లలో అయినా జనాలు కనిపించాలి. కానీ అదీ జరగలేదు. శనివారం అడ్వాన్స్ బుకింగుల హడావుడి కూడా లేదు. బుక్ మై షో ఓపెన్ చేస్తే అంతా పచ్చగానే ఉంది. ఈ వీకెండ్ లో అద్భుతాలు జరుగుతాయన్న నమ్మకం ఏమాత్రం లేదు.
టాలీవుడ్ కు పుష్ప ఫీవర్ పాకింది. అంతటా ఈ సినిమా గురించే చర్చ. ఇలాంటి దశలో మిగిలిన సినిమాలపై ప్రేక్షకులు ఫోకస్ చేయరు. పెద్ద సినిమా ముందు ఇలాంటి స్థబ్దత సహజమే. పుష్ప లాంటి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మిగిలిన సినిమాలు రిలీజ్ చేయడం ఓ రకంగా రిస్క్. ఇప్పుడు ఆ రిస్క్ చేసే ఇబ్బంది పడుతున్నాయి సినిమాలు. వచ్చే వారం అసలు ఒక్క సినిమా కూడా విడుదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అంతా పుష్ప మాయ.