ఒక నటుడికి ఐకానిక్ క్యారెక్టర్ పడటం ఎంత అవసరమో, ఆ క్యారెక్టర్ తెచ్చిన క్రేజ్, అంచనాలు అందుకునేలా కెరీర్ ని ముందుకు నడపటం కూడా అంతే కీలకం. కొన్ని క్యారెక్టర్లు యాక్టర్లకు,, వాళ్ల స్టార్డమ్ కి మించి జనాల్లోకి వెళ్ళిపోతాయి. మార్లన్ బ్రాండో తన కెరీర్ లో ఎన్నో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆయన్ని ‘గాడ్ ఫాదర్’గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత బ్రయాన్ క్రాన్స్టన్ ఏం చేశాడో కూడా చాలా మందికి తెలీదు. వాల్టర్ వైట్ గానే ప్రేక్షకులు మనసులో నిలిచాడు. ఓపెన్హైమర్ సిలియన్ మర్ఫీ కి ఆస్కార్ అవార్డ్ తెచ్చి ఉండొచ్చు గాక, మోజార్టీ ఆడియన్స్ కి మాత్రం పీకీ బ్లైండర్స్ లో టామీ షెల్బీ అంటేనే ఇష్టం.
టాలీవుడ్ లో కూడా ఐకానిక్ పాత్రలు వున్నాయి. బహుబలిగా పాన్ ఇండియాలో జెండా పాతారు ప్రభాస్. ఆ పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే.. బాహుబలి తర్వాత చేసిన సిద్ధాంత్ నందన్ (సాహో) విక్రమాదిత్య (రాధే శ్యామ్) పాత్రలు ఎంతమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. బాహుబలి ఇంపాక్ట్ నుంచి బయటికి రావడానికి ఆడియన్స్ కి చాలా సమయం పట్టింది. ప్రేక్షకులకే కాదు… ప్రభాస్ ఈ పాత్ర ప్రభావం నుంచి బయటకు రావడం అంతే కష్టం అయ్యింది.
ఇప్పుడు అల్లు అర్జున్ కి ఇలాంటి ఐకానిక్ క్యారెక్టర్ పుష్ప తో పడింది. పుష్ప ఏ రేంజ్ హిట్టో అందరికీ తెలుసు. ఈ సినిమాతో పాన్ ఇండియాలో బలమైన ముద్ర వేశాడు బన్నీ. పుష్ప ఇచ్చిన ఊపుతో పుష్ప 2ని మరింత పవర్ ఫుల్ గా తీశారు సుకుమార్. ఇది మామూలు పవర్ కాదు. పుష్ప క్యారెక్టర్ ని ఒక డైనమైట్ లా తయారు చేశారు. థియేటర్ లో కూర్చున్న ఆడియన్ ని ఆకర్షించే పవర్ ఫుల్ మాగ్నైట్ లా డిజైన్ చేశారు.
పుష్ప క్యారెక్టర్ తో ఒక మ్యాజిక్ జరిగిపోయింది. ఆ క్యారెక్టర్ ఇచ్చిన అడ్రినలిన్ రష్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఒక కమర్షియల్ సినిమాలో ఈ రేంజ్ పెర్ఫామెన్స్ నిజంగా అల్టిమేట్. నిజానికి పుష్ప లో వుండే కాన్ఫ్లిక్ట్ కొత్తదేమీ కాదు. కానీ పుష్ప క్యారెక్టర్ తో ప్రేక్షకుడు లీనమైపోవడంతో ఏది కూడా సమస్యలా అనిపించదు. అంతలా చొచ్చుకుపొయిందా క్యారెక్టర్. పుష్ప ఏం చేసినా జనాలకు నచ్చేసింది. కేవలం ఆ పాత్ర కోసమే జనం ఈ సినిమా చూశారు, చూస్తున్నారు. పుష్ప అనే పాత్రలో ఉన్న ఆ ఆకర్షణ.. ఈ కథలో, సంఘర్షణలో ఉన్న తప్పొప్పుల్ని సరి చేసింది.
నిజంగా పుష్ప క్యారెక్టర్ అల్లు అర్జున్ కెరీర్ లో మైల్ స్టోన్. అయితే ఇక్కడే తనపై భారం కూడా పడుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఆ స్థాయి పాత్రలు ఆశించినట్లుగానే ఇప్పుడు అల్లు అర్జున్ పై కూడా ఆటోమేటిక్ గా అలాంటి అంచనాలు వచ్చేస్తాయి. పుష్ప బన్నీకి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అయిపొయింది. దీన్ని ద్రుష్టిలో పెట్టుకునే ఇకపై కథలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.