ఈరోజు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం జరగాల్సిన వేడుక ఇది.ఏపీ మంత్రి చనిపోవడంతో.. వాయిదా వేయాల్సివచ్చింది. ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్‌పై.. పుష్ప ఎఫెక్ట్ భారీగా పడింది.
పుష్ప ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇదే ఆవరణలో జరిగింది. అనుమతికి మించి పాస్‌లు జారీ చేయడం వల్ల… క్రౌడ్ ఎక్కువ వచ్చేసింది. వాళ్లని అదుపు చేయడం చాలా కష్టమైంది. దాంతో తోపులాట జరిగింది. కొంతమంది అభిమానులు గాయ పడ్డారు. చాలామంది బయటే ఉండిపోవాల్సివచ్చింది. అలాంటి తప్పులు ఈ `భీమ్లా…` విషయంలో జరక్కూడదని పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. అందుకే పాసుల ముద్రణ బాధ్యత పోలీస్ శాఖ తీసుకుంది. సోమవారం నాటి ఈవెంట్ కి ఇది వరకే చిత్రబృందం పాస్‌లు పంపిణీ చేసేసింది. ఇప్పుడు అవి చెల్లవు. కేవలం పోలీస్ శాఖ పాసులు ఉంటే తప్ప, అనుమతి లేదు. సాధారణంగా 5 వేల కెపాసిటీ అనుకుంటే, 10 వేల పాసులు ముద్రించి, పంపిణీ చేస్తుంటారు. కానీ.. ఈసారి మాత్రం అలా జరగడం లేదు. సరిగ్గా 5 వేల పాసులు మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి టీవీ ఛానళ్లకు అనుమతి ఇవ్వలేదు. హారిక హాసిని యూ ట్యూబ్ ద్వారా మాత్రమే లైవ్ చూసేలా ఏర్పాటు చేశారు.