అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా `పుష్ష`. రేపు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్షరాజ్ ని పరిచయం చేయబోతోంది టీమ్. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అంటూ సుకుమార్, బన్నీ తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నార్ట. దానికి రెండు కారణాలున్నాయి. `పుష్ష` చాలా విస్తారమైన కథ. ఇప్పటి వరకూ రాసుకున్న సన్నివేశాలు ఉన్నది ఉన్నట్టు తీస్తే 3 గంటలకు పైబడి ఫుటేజ్ రాబోతోందట. అదీ కాక… సుకుమార్ దగ్గర ఈ సినిమాని కొనసాగించే పాయింట్ కూడా ఉందట. ఆ రెండూ కలిపి ఒకేసారి తీసేసి, రెండు నెలల గ్యాప్ లో ఈ రెండు భాగాల్నీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అనే విషయంపై అటు బన్నీ, ఇటు సుకుమార్ తర్జన భర్జనలు పడుతున్నారని టాక్. ఒకే భాగంగా ఈసినిమాని విడుదల చేయాలనుకుంటే, అనుకున్న సమయానికే ఈ సినిమా విడుదల అవుతుంది. లేదంటే.. వాయిదా పడుతుంది.
ఓరకంగా ఇది బాహుబలి స్ట్రాటజీనే. బాహుబలి కూడా ఒకే భాగం అనుకున్నారు. కానీ.. నిర్మాణ దశలో, కథ విస్తారం పెరిగి, రెండు భాగాలైంది. అది నిర్మాతలకు బాగా వర్కవుట్ అయిన స్ట్రాటజీ. దాన్ని `పుష్ష` కీ కొనసాగించబోతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయమైతే తీసుకోలేదు. బన్నీ, సుకుమార్ ఇద్దరూ ఓకే అనుకుంటే, పుష్ఫ 1, పుష్ష 2 కూడా ఉంటాయి.