Pushpa Telugu Review
రేటింగ్: 2.75/5
అల్లు అర్జున్ – సుకుమార్ ల ప్రయాణం దాదాపు ఒకేసారి మొదలైంది. ఆర్యతో సుకుమార్ స్టైల్ తెలిసింది. బన్నీ ఏం చేయగలడో అర్థమైంది. ఇక ఆ తరవాత ఇద్దరూ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. అటు అల్లు అర్జున్ ఐకాన్‌స్టార్ గా ఎదిగితే.. సుకుమార్ క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 మెప్పించకపోయినా – మళ్లీ ఇద్దరూ ఎప్పుడు కలుస్తారా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇన్నేళ్ల నిరీక్షణ `పుష్ప`తో ఫలించింది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. అంతేనా.. రెండు భాగాలు. కాబట్టి… పుష్పపై మరింత ఫోకస్ పెరిగింది. మరి… ఈ క్రేజీ కాంబో.. ఈసినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేశారు. ఐకాన్ స్టార్కీ, క్రియేటీవ్ డైరెక్టర్ కీ ఈ సినిమా ఎంత ప్లస్ అయ్యింది?
పుష్ఫరాజ్ (అల్లు అర్జున్) ఓ కూలీ. ఎవ్వరికీ తలవంచని తత్వం. తండ్రి పేరు అడిగితే.. మాత్రం కోపం వస్తుంది. ఎందుకంటే.. అది చెప్పుకునే సౌలభ్యం ఈ సమాజం ఇవ్వలేదు. తన సవతి తల్లి కొడుకుల అహంకారం మధ్యే తన బాల్యం బలైపోతుంది. అమ్మ ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటుంది. వాళ్ల మధ్యే దర్జాగా బతకాలన్నది పుష్ఫ కల.. కోరిక. అందుకోసం డబ్బు సంపాదించాలి. దాని కోసం.. ఎర్రచందనం స్మగ్లింగ్ కి అడ్డా అయిన శేషాచలం అడవుల్లో కూలీగా అడుగుపెడతాడు. అక్కడ్నుంచి అంచలంచెలుగా ఎదుగుతాడు. ఎర్రచందనం స్మగ్లర్మకు.. సిండికేట్ అయిన మంగళం శ్రీను (సునీల్) ఆధిపత్యానికి గండి కొట్టి.. తనే సిండికేట్ గా మారతాడు. మరి ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులేంటి? శ్రీవల్లీ (రష్మిక)తో ప్రేమ కథ ఎలా నడిచింది? భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఎవరు? పుష్పకి తనకీ మధ్య విరోధం ఎలా మొదలైంది? ఇవన్నీ పుష్ప చూసి తెలుసుకోవాలి.
అల్లు అర్జున్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. సుకుమార్ కథంటే కొన్ని `లెక్కలు`లు ఉంటాయి. అయితే…. తన లెక్కల్ని పక్కన పెట్టి, అల్లు అర్జున్ పై ఉన్న అంచనాల్ని నిజం చేయడానికి సుకుమార్ రాసుకున్న కథలా కనిపిస్తుంది. ఓ పక్కా మాస్ సినిమా నేను కూడా తీయగలను.. అని చెప్పడానికి సుకుమార్ చేసిన ప్రయత్నం ఇది. అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, తన బాడీ లాంగ్వేజ్, ఎర్ర చందనం అనే నేపథ్యం పక్కన పెడితే.. ఫక్తు కమర్షియల్ కథ ఇది. ఓ మామూలు కూలీ.. ఎలా సిండికేట్ గా ఎదిగాడన్నది కథ. వాటికి ఎలివేషన్లు, పాటలూ, విలన్లూ, ఫైట్లూ జోడించుకుంటూ వెళ్లిపోయాడు సుకుమార్. చాలా మామూలు కథని, చాలా మామూలుగా చెప్పినా – ప్రేక్షకులు సీట్లలో కూర్చోగలరు అని సుకుమార్ నమ్మాడంటే దానికి కారణం… హీరో క్యారైక్టరైజేషన్ని మౌల్డ్ చేయడంపై తనకున్న నమ్మకమే. బన్నీని ఇలాక్కూడా చూపించొచ్చా? అని ఆశ్చర్యపోయేలా తన పాత్రని తీర్చిదిద్దాడు. ఆ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. దాంతో.. ఓ మామూలు కథలో.. ఏదో తెలియని ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. అది కచ్చితంగా బన్నీ నుంచి వచ్చిందే.
తెరనిండా అనేక పాత్రలు, ముఖ్యంగా లెక్కపెట్టడం వీలుకానంతమంది విలన్ గ్యాంగ్. అయితే… ఎవరి విలనిజం కూడా పూర్తి స్థాయిలో ఎలివేట్ అవ్వదు. రెడ్డి బ్రదర్స్ లో నలుగురు ఉన్నా – వాళ్లెవరూ పుష్ప రాజ్ ధాటికి నిలబడలేకపోయారు. మంగళం శ్రీను గెటప్‌లో ఉన్న భయం… ఆ క్యారెక్టరైజేషన్ ద్వారా రప్పించలేకపోయాడు సుకుమార్. ఇంతా పోగేస్తే.. సునీల్ కనిపించే సీన్లు మూడో.. నాలుగో. అంతే. రావు రమేష్ ని సైతం క్లైమాక్స్‌కి ముందే రంగంలోకి దింపాడు. ఫాజల్ అయితే. చివర్లో కనిపించాడు. తన ఎపిసోడ్ లో.. భన్వర్ సింగ్ అనే ఓ ప్రధాన ప్రత్యర్థి రంగంలోకి దిగాడు.. అని చెబితే సరిపోయేది. ఆ భన్వర్ సింగ్ ని సైతం.. పుష్ఫ గడగడలాడించి, బట్టలూడదీసి, పరుగులు పెట్టించి అప్పుడు శుభం కార్డు వేశాడు. ఇక పార్ట్ 2లో చూడాల్సింది పుష్ప – భన్వర్ల మధ్య రణమే.
పార్ట్ 2 చూడాలన్న ఆసక్తి కలిగించేలా ఓ ట్విస్ట్ ఉంటే బాగుండేది. భన్వర్ ఎంట్రీతో కథని ఆపేసినా… భన్వర్ సింగ్ ఏం చేయగలడో చూద్దాం అన్న ఆసక్తి మొదలయ్యేది. కానీ ఆ రెండూ జరగలేదు. దాదాపు 3 గంటల సినిమా ఇది. సహనానికి పరీక్షే. దానికి తోడు… ద్వితీయార్థం మరీ లాగ్ అయినట్టు అనిపిస్తుంది. రష్మిక తో లవ్ ట్రాక్ ఓకే అనిపిస్తుంది. అంతకు మించిన సుకుమార్ మార్క్ కనిపించదు. అసలు సుకుమార్ లవ్ స్టోరీల్ని బాగా డీల్ చేయగలడు. ఆ మ్యాజిక్ ఇందులో మిస్ అయ్యింది. పాటలు ఆల్రెడీ హిట్ కాబట్టి.. థియేటర్లో ఆ పాట ప్లే అవగానే ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. కాకపోతే ఒకట్రెండు పాటల పిక్చరైజేషన్ మాత్రమే బాగుంది. ఊ అంటావాలో సమంతని సైతం సరిగా చూపించలేకపోయాడు.
ఇక ఫైట్స్ విషయానికొస్తే. అన్నీ ఒకేలా ఉండడం నిరుత్సాహపరుస్తుంది. కొన్ని కొన్ని చోట్ల.. ఎలివేషన్లు బాగున్నాయి. అవే.. బన్నీ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయం.
అల్లు అర్జున్ ఈ సినిమాని భుజం పై వేసుకుని నడిపించేయడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఓ రకంగా… తనలో కొత్త కోణాన్ని ఎలివేట్ చేసే పాత్ర ఇది. ఇంత రగ్గడ్ గా, ఇంత డీ గ్లామర్ గా బన్నీనే కాదు, ఇంకే హీరోనీ ఎవరూ చూపించలేరేమో అనిపిస్తుంది. చిత్తూరు యాస కూడా బన్నీ బాగా ఓన్ చేసుకున్నాడు. పాటల్లో, ఫైట్స్‌లో అదే బాడీ లాంగ్వేజ్ కొనసాగించడం అంత తేలికైన విషయం కాదు. రష్మిక పాత్ర సైతం డీ గ్లామర్ గానే సాగింది. అయినా అక్కడక్కడ రష్మికలో గ్లామర్ మెరుస్తూనే ఉంటుంది. సునీల్ ని సరిగా వాడుకోలేదు. కొన్ని పాత్రలు మిస్ కాస్టింగ్ అయ్యాయి. కేశవ పాత్రతో కథ చెప్పించడం బాగుంది కానీ, ఆ పాత్రలో తెలుసున్న నటుడ్ని తీసుకుంటే బాగుండేది. పుష్ఫ – కేశవ మధ్య ఎమోషన్ కనెక్టివిటీ మిస్ అయ్యింది.
దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆల్రెడీ హిట్టు. ఆ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆర్.ఆర్ కి కావల్సినంత టైమ్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల తేలిపోయాయి. ముఖ్యంగా డామ్ లో ఎర్రచందనం దుంగలు తేలి వెళ్లే సీన్ లో. శ్రీకాంత్ విస్సా సంభాషణలు మెప్పిస్తాయి. సుకుమార్ స్టైల్ కి తగ్గట్టు సాగాయి పార్ట్ 2 అనే ఆలోచన పక్కన పెట్టి, ఈ కథని ఒకే సినిమాగా తీస్తే బాగుండేదేమో..? అప్పుడైనా ఈ అనవసరమైన లాగ్ ఉండేది కాదు.
పుష్ప పక్కాగా మాస్ సినిమా. అంతే. ఇందులో సుకుమార్ ఇంటిలిజెన్సీ కనిపించదు. తను ఓ పక్కా మాస్ డైరెక్టర్లా మారిపోయి తీసిన సినిమా ఇది. అల్లు అర్జున్ కోసం.. తన నటన కోసం.. పుష్ప కోసం.. మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. అలా ఫిక్సయి వెళ్తేనే పుష్ప అలరిస్తాడు.
ఫినిషింగ్ టచ్: ఏదో తగ్గింది
రేటింగ్: 2.75/5