టిక్కెట్ రేట్ల అంశంపై డివిజనల్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం తమదైన పద్దతిలో షాక్ ఇవ్వడానికి ఆప్షన్లు రెడీ చేసుకుంది. సింగిల్ బెంచ్ ఇచ్చినతీర్పులో జీవో 35ని రద్దు చేస్తున్నట్లుగా ఎక్కడా లేదని వైసీపీ సొంత మీడియాలో ప్రచారం ప్రారంభించారు. జీవో జారీ చేయడానికి ముందున్న పద్దతిలోనే టిక్కెట్ ధరల ఖరారు చేసుకోవాలని మాత్రమే ఆదేశించిందన్నారు. అంతకు ముందు ఉన్న పద్దతి ప్రకారం పెద్ద సినిమాల విడుదల సమయంలో సినిమా ధియేటర్ల వ్యవహారాలు చూసే జాయింట్ కలెక్టర్ల ఆమోదంతో టిక్కెట్ రేట్లు పెంచుకోవాలి.
మామూలుగా అయితే రేట్ల పెంపును తిరస్కరించే అవకాశం లేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలాంటి సంప్రదాయాలు.. నిబంధనలు తమ వైపు నుంచి పాటించడం ఇప్పటి వరకూ జరగలేదు. అందుకే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించినా సరే శుక్రవారం విడుదల అవుతున్న పుష్పకు టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం దక్కకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్నికాదని టిక్కెట్ రేట్లను పెంచుకునే అవకాశం డిప్యూటీ కలెక్టర్లు ఇవ్వలేరు. అలా ఇస్తే అప్పటికప్పుడు ట్రాన్స్ ఫర్ అవుతారు. ఒక వేళ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టి వేస్తే అసలు సమస్యే ఉండదు.
ప్రభుత్వం రూ. ఐదు నుంచి రూ. 250 వరకూ ఖరారు చేసిన టిక్కెట్లనే వసూలు చేయాలి. అదే జరిగితే పుష్పకు సగం కలెక్షన్లు లాస్ అవుతాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే పుష్ప సినిమా కలెక్షన్లు దెబ్బతీయడానికి వకీల్ సాబ్ టైంలో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. అన్ని ప్రయత్నాలూ జరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. ఆ ప్రయత్నాలను చేధించగలిగితే ఇతరులకూ ధైర్యం వస్తుంది. లేకపోతే.. ప్రభుత్వానికి లొంగి పోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు.