దేశం మొత్తం వసూళ్లతో ఓ కుదుపు కుదిపేసిన సినిమా ‘పుష్ప 2’. తాజాగా రూ.1500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మైలు రాయి దాటిన అతి కొద్ది సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. తెలుగునాట ‘పుష్ప 2’ రన్ దాదాపుగా ముగిసినట్టే. నార్త్‌లో వసూళ్లు బాగున్నాయి. మొత్తానికి ఎలాగోలా రూ.2000 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమాని చేర్చాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యం చేస్తున్నారు. ఈమధ్య ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన 4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే ‘పుష్ప 2’ని మాత్రం 8 వారాల వరకూ విడుదల చేయకూడదని భావిస్తున్నారు.
మరోవైపు ‘పుష్ప 2’ ఓటీటీ వెర్షన్ రెడీ అయిపోయింది. 3 గంటల 20 నిమిషాల సినిమా ఇది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ చేసిన సన్నివేశాలు కొన్ని కలిపే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అలాంటి యాడింగులు ఏమీ లేవని తెలుస్తోంది. వెండి తెరపై చూసిన వెర్షనే.. ఓటీటీ తెరపైనా చూడబోతున్నారు. కొత్త సన్నివేశాలు లేవు. కాకపోతే సింక్ సౌండ్ లో లోపం వల్ల థియేటర్లో కొన్ని డైలాగులు సరిగా వినపడలేదు. వాటిని సరి చేశారంతే. గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పాలు పంచుకోవడానికి సుకుమార్ అమెరికా వెళ్లారు. ఈలోగా.. ఓటీటీ వెర్షన్‌కి తుది మెరుగులు కూడా దిద్దేశారు. ఇక నెట్ ఫ్లిక్స్ చేతిలో పెట్టడమే తరువాయి. పుష్ప 2ని ఓటీటీలో చూడాలంటే బహుశా ఫిబ్రవరి వరకూ ఆగాలేమో!