పుష్ప 2 సినిమా ప్రీమియర్ లో తొక్కిసలాటలో కోమాలోకి వెళ్లిపోయిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. కళ్లు తెరిచి చూస్తున్నా ఎవర్నీ గుర్తు పట్టడం లేదు. ఆకలి కూడా తెలియడం లేదు. లేచి కూర్చునే పరిస్థితి కూడా లేదు. ఆహారాన్ని కూడా పైపుల ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికి మూడు నెలలు అయింది. ఆ పిల్లవాడి పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందో వైద్యులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
తొక్కిసలాట జరిగినప్పుడు బ్రెయిన్‌కు చాలా సేపు రక్త ప్రసరణ ఆగిపోవడం అసలు సమస్యకు కారణంగా మారింది. ఆస్పత్రికి తరలించిన తర్వాత రక్త ప్రసరణ జరిగేలా చూసినప్పటికీ అప్పటికే మెదడుకు జరగాల్సినా నష్టం జరిగిపోయింది. ఈ కారణంగా కొద్ది రోజులు కోమాలో ఉన్నారు. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి అంత మెరుగ్గా మారడం లేదు.
శ్రీతేజ్‌ను ఎలాగైనా మామూలు మనిషిని చేయడానికి అవసరమైన వైద్య సాయం, ఖర్చులకు ఇబ్బంది లేదు. విదేశీ వైద్య నిపుణుల సాయం తీసుకుంటున్నారు. పుష్ప టీం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుంది. అందరి కృషి ఫలించి ఆ కుర్రవాడు సాధారణ స్థితికి వస్తే అంత కంటే గొప్ప విజయం ఉండదని పుష్పటీం కూడా భావిస్తోంది.