ఆగస్టు 15… సుకుమార్ ముందున్న టార్గెట్ ఇదే! ‘పుష్ష 2’ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు విడుదల చేయాలని కసిగా పని చేస్తున్నాడు. పుష్ష 2 ఆగస్టు 15న రాదని, ఆలస్యం అవుతుందని రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే సుక్కు మాత్రం తన పని తాను చేసుకొంటూ పోతున్నాడు. పోస్టర్లోనూ, టీజర్లోనూ ఆగస్టు 15నే వస్తున్నాం అని నొక్కి నొక్కి మరీ చెబుతున్నాడు. ఇచ్చిన మాట కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు.
‘పుష్ష’ టీమ్ ఎంత కష్టపడుతోందంటే, ఒకటి కాదు, రెండు కాదు, మూడు టీమ్ లు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. పుష్ఫ ఫైట్, సాంగ్, ప్యాచ్ వర్క్ ఒకేసారి జరుగుతున్నాయి. మూడు చోట్లా.. సుకుమార్ అన్ని వ్యవహారాల్నీ కంట్రోల్ చేస్తున్నాడు. పగలు లేదు, రాత్రి లేదు. వర్క్ జరుగుతూనే ఉంది. జూన్ చివరి వారంలో షూటింగ్ పూర్తి చేస్తే, జులై మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవొచ్చు. ఆగస్టులో ప్రమోషన్లకు తిరిగే ఛాన్స్ ఉంది. ‘పుష్ష’ సమయంలో చివరి నిమిషం వరకూ పనులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్రమోషన్లకు పెద్దగా సమయం దొరకలేదు. ఆ పొరపాటు ఈసారి చేయకూడదని సుకుమార్ భావిస్తున్నాడు.