దేశమంతా పుష్ప హావా నడుస్తోంది. పుష్పరాజ్ ప్రభంజనానికి రికార్డులు పోటెత్తుతున్నాయి. నార్త్‌లో వసూళ్ల వర్షం కురుస్తోంది. మరో వారం, పది రోజులు పుష్పదే. ఎందుకంటే ఈ వారం బాక్సాఫీసు ముందుకు సినిమాలేం రావడం లేదు. కాబట్టి… ఈ వీక్ కూడా ‘పుష్ప’ తప్ప మరో ఆప్షన్ లేదు.
విడుదలకు ముందు ‘పుష్ప 2’ తెచ్చుకొన్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ దేశమంతా చుట్టొచ్చాడు. పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ప్రీమియర్లు భారీ ఎత్తున నిర్వహించడం, టికెట్ రేట్లకు తెచ్చుకొన్న హై.. ఇవన్నీ ‘పుష్ప 2’ గురించి మాట్లాడుకొనేలా చేశాయి. ‘ఈ సినిమా ఎలాఉన్నా చూసేయాల్సిందే’ అనుకొనేంతలా ప్రేక్షకుడు ఫిక్సయిపోయాడు. ఓ భారీ సినిమాకు ఇలాంటి హైప్ చాలా అవసరం కూడా. ‘పుష్ప 2’ ఓపెనింగ్స్ ఈ స్థాయిలో వచ్చాయంటే, దానికి కారణం… సినిమాపై జరిగిన చర్చ, చిత్రబృందం చేసిన ప్రచారం, విడుదల చేసిన కంటెంట్.
ఓ పెద్ద సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ‘పుష్ప2’ చేసి చూపించింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా ‘పుష్ప 2’నే ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమాత్రం హైప్ తీసుకురాకపోతే.. జనాలు థియేటర్లకు రారన్న నిజం కూడా మేకర్స్ గ్రహించారు. బాక్సాఫీసు దగ్గరకు ‘పుష్ప 2’ తరవాత బాక్సాఫీసు ముందుకు రాబోతున్న పెద్ద సినిమాలు ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇందులో ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తో వస్తున్న సినిమా. కచ్చితంగా ‘పుష్ప 2’ ఎఫెక్ట్ ఈ సినిమాపై ఉంటుంది. ప్రమోషన్లు, కంటెంట్ బయటకు వదలడం, విడుదలకు ముందు చేయాల్సిన హడావుడీ.. వీటిపై ఎక్కడా తగ్గకూడదు. పైగా మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ ఉంది. చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ ‘పుష్ప 2’ పై సీత కన్నేశారు. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ తిరిగి ఇచ్చే టైమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రమోషన్లు ఏమాత్రం తగ్గినా… థియేటర్లకు రావాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. సంక్రాంతి సినిమాలు కదా, ఎలాఉన్నా జనం వస్తారు అనుకొనే రోజులు కావివి. చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. ‘పుష్ప 2’లాంటి సునామీ వచ్చిన తరవాత.. ఆ స్థాయిలో కనిపించాలంటే అంతకు మించి ఏదో మ్యాజిక్ చేయాలి. సంక్రాంతి సినిమాలపై ఈ ఒత్తిడి నూటికి నూరుశాతం ఉంది.