బాక్సాఫీసు దగ్గర పుష్పరాజ్ చేసిన హంగామా ఇప్పట్లో అభిమానులు మర్చిపోలేరు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వసూళ్లు కొల్లగొట్టింది. దాదాపు రూ.1700 కోట్లతో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఓటీటీ రికార్డుల్ని బ్రేక్ చేయడానికి రెడీ అయ్యింది. ఈనెల 30 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో `పుష్ప 2` ఓటీటీ వెర్షన్ చూడొచ్చు. థియేటర్లో 3 గంటల 20 నిమిషాల సినిమా ఇది. ఇప్పుడు మరో 20 నిమిషాలు జోడించి, 3 గంటల 40 నిమిషాలుగా విడుదల చేస్తున్నారు. 20 నిమిషాల రీలోడెడ్ వెర్షన్‌ని థియేటర్లలో విడుదల చేసినా.. స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. అయితే ఓటీటీ కాబట్టి… థియేటర్లో చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే 20 నిమిషాల సన్నివేశాలు అదనంగా ఉన్నాయి. ఆ 20 నిమిషాల్లో పుష్ప ఏం చేశాడన్న కుతూహలం అందరికీ ఉంటుంది. సాధారణంగా బాక్సాఫీసు దగ్గర హిట్టయిన బడా హీరోల సినిమాలకు ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుంది. పుష్ప2 కి మరింత ఉంటుంది. దానికి అదనంగా.. కొత్త సన్నివేశాలు జోడించారు. దాంతో.. ఈ క్రేజ్ మరింత పెరిగిపోవడం ఖాయం. ఈ కారణంతోనే ఓటీటీ పరంగా పుష్ప 2 కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి 3 గంటల 20 నిమిషాలే ఓటీటీ వెర్షన్లోనూ విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. `రీ లోడెడ్` పేరుతో కొత్త సన్నివేశాలు జోడించి, థియేటర్లో విడుదల చేస్తే అదనపు వసూళ్లు ఉంటాయని, లాంగ్ రన్ ఉంటుందని భావించారు. థియేటర్లో ఈ స్కీమ్ వర్కవుట్ కాలేదు. కాకపోతే ఓటీటీ ప్రేక్షకులకు కొత్త సన్నివేశాలు చూసే అవకాశం దక్కుతోంది.