డిసెంబరు 5న పుష్ప 2 రిలీజ్ అయ్యింది. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. దాదాపు రూ.1700 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. మరో 20 నిమిషాల ఫుటేజీ అదనంగా జోడించడం వల్ల, ధియేటర్లో చూసిన వాళ్లు సైతం ఓటీటీలో మరోసారి చూస్తున్నారు. రెండు నెలల తరవాత ఈ సినిమాకు థ్యాంక్స్ మీట్ పెడుతున్నారు. ఈరోజు సాయంత్రం ఓ స్టార్ హోటెల్ లో చిత్రబృందం ధ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరవుతుండడంతో అందరి దృష్టీ ఈ ఈవెంట్ పై పడింది. ఈ మీట్ కు.. ఫ్యాన్స్‌కు అనుమతి లేదు. మీడియాను కూడా లిమిట్ గానే ఆహ్వానాలు అందుతున్నాయి.
సినిమా విడుదలై రెండు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ధ్యాంక్స్ మీట్ ఎందుకన్నది ప్రశ్న. నిజానికి ‘పుష్ప 2’ మంచి విజయాన్ని అందుకొంది. సెలబ్రేషన్స్ కి అర్హత ఉన్న సినిమా. కానీ.. ‘పుష్ప 2’ విడుదలైన తరవాత అనేక ఘటనలు జరిగాయి. సంధ్య ధియేటర్ వ్యవహారంలో బన్నీ బాగా ఇబ్బంది పడ్డాడు. దాంతో సక్సెస్ టూర్లు, సెలబ్రేషన్స్ ఏమీ లేకుండా పోయాయి. ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరిస్థితి అలానే ఉంది. మెరుగైన వైద్యం కోసం శ్రీతేజ్ ని విదేశాలకు తీసుకెళ్దామనుకొంటున్నారు. పుష్ప 2 సినిమాను, సాధించిన విజయాన్ని అభిమానులు క్రమంగా మర్చిపోతున్నారు. ఇలాంటి దశలో ధ్యాంక్స్ మీట్ అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ధ్యాంక్స్ మీట్ లో బన్నీ ఏం మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టుకొని చూడ్డానికి ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అలాంటప్పుడు స్కిప్ చేస్తే బాగుండేది. కాకపోతే… ఇంత పెద్ద హిట్ తరవాత ఏ హీరోకైనా ఫ్యాన్స్‌కి, సినిమాకు ఆదరించిన వాళ్లకు, ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లకు ధ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకే బన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ కు ఒప్పుకొని ఉంటాడు. ఈ ధ్యాంక్స్ మీట్ తరవాత పుష్ప 2 లగేజీ పక్కన పెట్టేసి, త్రివిక్రమ్ సినిమా పనుల్లో పడిపోవాలన్నది బన్నీ ఆలోచన కూడా.