వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి స్వరాల్లో.. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కుటుంబం కూడా చేరింది. పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు తండ్రి.. చంద్రశేఖరరాజు మీడియా సమావేశం పెట్టి మరీ అభివృద్ధి జరగడం లేదని.. మండిపడ్డారు. కురుపాంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రోడ్లు, తాగునీటి కల్పనతో పాటు అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలం చెందారని ఆరోపించారు. వైసిపి కి అనుకూలంగా లేకపోతే అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వటం లేదన్నారు. అవకాశం ఉన్నా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడంలో విఫలమయ్యారని విమర్సించారు.
చంద్రశేఖర రాజు మాజీ ఎమ్మెల్యే. వివిధ కారణాల రీత్యా ఆయన బరి నుంచి తప్పుకుని.. పుష్పశ్రీవాణిని బరిలో నిలుపుతున్నారు. రాజకీయ వ్యూహాలను ఆయనే డిసైడ్ చేస్తూ ఉంటారని చెబుతూంటారు. ఈ క్రమంలో.. పుష్పశ్రీవారి కుటుంబం అసంతృప్తికి గురయిందని భావిస్తున్నారు. ఇసుక విషయంలో.. అభివృద్ధి పనుల విషయంలో… ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సాధారణంగా ఇలాంటి విమర్శలు మీడియా ముందు చేస్తే..పార్టీ హైకమాండ్ తీవ్రంగా స్పందిస్తుంది. అయితే..వరుసగా ఒకరి తర్వాత ఒకరు.. తమ వాయిస్ వినిపిస్తూ ఉండటంతో..వారిని ఎలా సైలెంట్ చేయాలో తెలియక.. వైసీపీ పెద్దలు సతమతమవుతున్నారు.
గతంలో.. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఇలా మాట్లాడటంతో.. ఆయనకు.. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్న ప్రచారం జరుగుతోంది. ప్రజల నుంచి వివిధ పనుల కోసం వస్తున్న ఒత్తిడి కారణంగానే.. నేరుగా ప్రభుత్వాన్ని కాకుండా.. సమస్యలను ప్రస్తావిస్తూ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.