ఖమ్మంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పుడు కనిపించడం లేదు. బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మార్చి 7వ తేదీన ఖమ్మంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఆ మీటింగ్‌లో.. మరో పది రోజులైతే కాంగ్రెస్ వంద రోజుల గడువు తీరుతుంది.. ఆ తర్వాత నుంచి ఆ పార్టీని నిలేస్తామన్న పువ్వాడ మళ్లీ కనిపించలేదు.
మార్చి 15వ తేదీన లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అయిన మరుసటి రోజు నిర్వహించిన నిరసనల్లోనూ ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మినహా మిగిలిన ఏ ఒక్క ముఖ్య నేత కనిపించలేదు. అజయ్ కనీసం నిరసన తెలిపేందుకు రాలేదు. బీఆర్ఎస్లో ఉండి ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు . అలాగని ఆయనకు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఉండదు. పొంగులేటి, తుమ్మల ఉన్నారు. అందుకే బీజేపీలో చేరి హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గంపై దృష్టి సారించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఆయన పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఆస్తుల సంరక్షణ కోసం సేఫ్ జోన్‌ను వెతుక్కునే పనిలో ఉన్నట్టు భావిస్తున్నారు. అజయ్‌కు నమ్మినబంటు పూర్వ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్‌ను ముందుగా బీజేపీలోకి పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నామా నాగేశ్వరరావు కోసం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో అజయ్ పాల్గొనడం కూడా కష్టమని చెబుతున్నారు.