హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలింది. వైస్ ఛాన్సలర్ అప్పారావును సెలవుపై పంపించింది. ఆయన స్థానంలో యూనివర్సిటీలోని ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవను ఇన్ఛార్జ్ వీసీగా నియమించింది. విశేషమేమిటంటే రోహిత్, అతని అనుచరులను గతంలో సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన కమిటీకి శ్రీవాత్సవ నాయకత్వం వహించారు. మరోవైపు ఈ పరిణామంపై విద్యార్థులు మరింత మండిపడుతున్నారు. వీసీ అప్పారావును సెలవుపై పంపిస్తే సరిపోదని, అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్స్ చేసిన ప్రొఫెసర్కే ఇన్ ఛార్జ్ వీసీ బాధ్యతలు అప్పగించటమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవటం వంటి ఐదు డిమాండ్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఏడుగురు విద్యార్థుల నిరసనను భగ్నం చేసి నిన్న ఆసుపత్రిలో చేర్చటంతో వారి స్థానంలో మరో ఏడుగురు విద్యార్థులు ఇవాళ దీక్ష ప్రారంభించారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును తొలగించటం, రోహిత్ కుటుంబానికి రు.50 లక్షల పరిహారం చెల్లింపు వంటి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు దీక్ష కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు. ఇక నిన్న ఆసుపత్రిలో చేర్చిన ఏడుగురు విద్యార్థులలో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో వారిని ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయమని చెప్పినట్లు యూనివర్సిటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర కుమార్ చెప్పారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వివిధ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. మరోవైపు దీక్షలకు సారధ్యం వహిస్తున్న జేఏసీ రేపు చలో హెచ్సీయూ కార్యక్రమం నిర్వహించనుంది. అటు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీని దర్శించి రోహిత్ సహచరులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన వెంట జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.