పీవీ నరసింహారావు… తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు. ఢిల్లీ పీఠమెక్కినా, తెలుగు భాషపై, తెలుగు గడ్డపై మమకారం చావని వ్యక్తి. తెలుగు భాష అన్నా, రచయితలన్నా, తెలుగు సాహిత్యం అన్నా.. ఎంతో అభిమానం, గౌరవం. అందులోనూ బాపు – రమణ అంటే వల్లమాలిన ప్రేమ. వీళ్ల అనుబంధం ఎంతటిదో తెలియాలంటే… ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాలి.
పీవీ నరసింహారావు కేంద్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న రోజులవి. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ హిందీలో అనువదించారు. ‘సహస్రఫణ్’ పేరుతో. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వేయి పడగలను దూర దర్శన్ కోసం సీరియల్ గా తీయాలన్నది పీవీ ఆశ. పీవీ లాంటి వ్యక్తి, అందునా ప్రభుత్వ కార్యక్రమం.. ఈ టీవీ సీరియల్‌ని నెత్తిన వేసుకోవడానికి చాలామంది దర్శకులు పోటీ పడ్డారు.కానీ పీవీ దృష్టి బాపు – రమణలపైనే ఉంది.
ఓసారి ఇద్దరినీ పిలిపించి `వేయి పడగలు`ని టీవీ సీరియల్‌కి అనుగుణంగా 104 ఎపిసోడ్లుగా మార్చి స్క్రిప్టు రూపంలో తయారు చేసుకురమ్మని పురమాయించారు. `వేయి పడగలు` అంటే.. రమణకి భలే ఇష్టం. అప్పటికే చాలాసార్లు చదివేసి ఉన్నారు. అందుకే.. సీరియల్ రూపంలో మార్చడానికి పెద్ద కష్టమనిపించలేదు. కొన్నాళ్లపాటు కసరత్తు చేసి, స్క్రిప్టు తయారు చేసుకుని పీవీ దగ్గరకు వెళ్లారు.
104 ఎపిసోడ్లలో సగం అయినా రాశారా? అని పీవీ అడిగితే
”14 మాత్రమే రాశాం.. అంతకంటే ఒక్క ఎపిసోడ్ కూడా సాగదీయడం ఇష్టం లేదు సార్” అన్నార్ట.
”300 ఏళ్ల చరిత్ర, వేయి పేజీల పుస్తకం, 37 అధ్యాయాలున్న పుస్తకం.. 14 ఎపిసోడ్లలో కుదించడం ఏమిటి?” అని షాకయ్యారు పీవీ.
ఇదే పుస్తకాన్ని 200 ఎపిసోడ్లుగా చేస్తాం అని చాలా మంది దర్శకులు అప్పటికే పీవీ చుట్టూ తిరుగుతున్నారు.
104 ఎపిసోడ్లు చేస్తే.. దానికి తగ్గ పారితోషికం వస్తుంది, పని దొరుకుతుంది. కానీ.. బాపు – రమణ మాత్రం 14 ఎపిసోడ్లు మించి తీయలేం అని చేతులెత్తేశారు.
”వేయి పడగలు పుస్తకంలో జల ప్రళయాలు, మంచు కొండల విధ్వంసాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ తీస్తూ.. 104 ఎపిసోడ్లూ చేసుకుంటూ వెళ్తే.. హాలీవుడ్ సినిమాల బడ్జెట్‌ని మించిపోతుంది. దూరదర్శన్ దగ్గర అంత బడ్డెట్టూ లేదు. ఉన్న విషయాన్ని సాగదీసి చెప్పడం కంటే, కుదించి అందంగా చెప్పడమే గొప్ప. టీవీ సీరియల్‌కి అదే ముఖ్యం” అని రమణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కానీ పీవీ వినలేదు. వేయి పడగలు పుస్తకంపై పీవీకి ఉన్న ప్రేమ అలాంటిది. దాన్ని 104 ఎపిసోడ్లుగా తీయాల్సిందే అని.. బాపు – రమణల్ని కాదని మరొకరికి ఆ ప్రాజెక్టు అప్పగించారు.
కొన్నాళ్లకు పీవీ – రమణలు మళ్లీ వేరే సందర్భంలో కలిశార్ట.
వేయి పడగలు ప్రస్తావన మళ్లీ వీళ్ల మధ్య వచ్చింది. ”రమణ గారు మీరు చెప్పింది కరెక్టే.. వేయి పడగల్లో 18 పడగలే విచ్చుకున్నాయి. మిగిలినవి బజ్జున్నాయి” అన్నార్ట నవ్వుతూ.
ఆ ప్రాజెక్టుని మరో దర్శకుడిడి అప్పగించారు కదా. బడ్జెట్ మొత్తం సాంతం అవ్వగొట్టి.. కేవలం 18 ఎపిసోడ్లే తీయగలిగాడట. ఆ తరవాత.. మళ్లీ ఆ సీరియల్ జోలికి వెళ్లలేదు పీవీ.
అదీ వేయి ఎపిసోడ్ల కథ. ఈ విషయాన్ని ముళ్లపూడి వెంకటరమణ తన ‘ముక్కోతి కొమ్మచ్చి’ పుస్తకంలో రాసుకున్నారు