మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు… ఇలా పీవీ గురించి పరిచయ వాక్యం చెప్పుకుంటే అది ఆయన దేశానికి చేసిన మేలు గురించి కించిత్ కూడా చెప్పదు. దేశానికి చాలా మంది ప్రధానులు వచ్చారు.. వెళ్లారు.. వస్తూంటారు కూడా. వచ్చే వారు ఎలాంటి ముద్ర వేస్తారో తెలియదు కానీ.. పాలించిన వాళ్లలో మాత్రం… పీవీ నరసింహారావు చరిత్రలో తనకంటూ ప్రత్యేకత నిలుపుకున్నారు. కేంద్రం ప్రస్తుతం కలవరిస్తున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు పునాదులు పీవీ నరసింహారావే వేశాడంటే అతిశయోక్తి కాదు.
భారత్‌ను తాకట్టు నుంచి విడిపించిన ఆర్థిక సంస్కరణల ఆద్యుడు..!
పీవీ నరసింహారావు… క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. రాజకీయంగా మాత్రమే.. దేశానికి కూడా అవి క్లిష్ట పరిస్థితులే. 1991లో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. దేశంలో ఆకలి రాజ్యం ఏలుతున్న సమయం. అలాంటి సమయంలో పీవీ నరసింహారవు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఓ వైపు కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్ని ఎదుర్కొంటూనే దేశ ఆర్థిక పరిస్థితుల్ని చక్క బెట్టారు. మన్మోహన్ సింగ్‌ను ఏరి కోరి.. ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడంతో బంగారాన్ని ప్రత్యేక విమానంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు పంపి.. తనఖా పెట్టి అప్పటి పరిస్థితుల నుంచి గట్టెక్కించారని.. ఆ తర్వాత ఆ బంగారాన్ని విడిపించడమే కాకుండా.. ఎవరూ ఊహించని స్థాయిలో విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని ఐదేళ్లలో పెంచారని.. రికార్డులు చెబుతున్నాయి. మైనార్టీ ప్రభుత్వాన్నే పీవీ నరసింహారావు ఐదేళ్ల పాటు నడిపారు. ఎన్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టినా ఆయన దేశానికి మేలు చేసే నిర్ణయాల విషయం మాత్రం.. ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.
అరాచక రాజకీయానికి ఎదురొడ్డి నిలబడిన నేత..!
స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని.. కాంగ్రెస్‌లో సభ్యునిగా చురుకుగా ఉంటూ.. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు పీవీ నరసింహారావు. మొదట్లో మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు 1971 నుంచి 73 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలకే పరిమితమయ్యారు. హోం మంత్రిగా.. రక్షణ మంత్రిగా.. విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. రాజీవ్‌గాంధీకి అన్నీ తానై వ్యవహరించారు. ఆయన రాజకీయం చాలా స్వచ్చంగా ఉంటుంది. ఏపీలో కొంత మంది రాజకీయం అప్పుడప్పుడే అరాచకంగా ఉండేది. దాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఓ సారి పులివెందుల వెళ్తే.. ఆయనపై చెప్పులు కూడా వేయించారు. ఆయన చేసే రాజకీయానికి… కాంగ్రెస్‌లో అప్పుడే ప్రారంభమైన అరాచకానికి.. పొంతన లేదు. దాంతో ఆయన సొంత పార్టీ మీదే పట్టు కోల్పోయారు.
సాహిత్య ప్రతిభను బయటకు కనిపించనీయకుండా చేసిన రాజకీయ వెలుగు..!
పీవీ నరసింహారావు రాజకీయంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగారో.. సాహిత్య పరంగా..,కూడా ఆయనకు ఆ స్థాయి ఉంది. ఆయన బహుభాషా కోవిదుడు. దేశంలో ఉన్న ప్రధానమైన భాషలన్నీ ఆయనకు వచ్చు. 17 భాషల్లో రాయడం.. చదవడం కాదు.. సాహిత్య పరంగా రచనలు చేయగలిగిన స్థాయి ఆయనది. అనువాదాలు కూడా చేస్తూంటారు. విశ్వనాథ సత్యనారాయణ రచన “వేయిపడగలు”ను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదిచారు. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. పీవీ రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్. ఇది పీవీ ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది. ఆయన రాజకీయాల్లోనే ఉన్నత స్థాయికి ఎదగడంతో ఆ దిశగానే పేరు వచ్చింది. ఆయన సాహిత్య ప్రతిభకు రావాల్సినంత పేరు రాలేదు. అది రాజకీయ వెలుగు కిందనే..నీడలో ఉండిపోయింది.
ఇప్పుడు పీవీ ఎంత మేలు చేశారో గుర్తిస్తున్న దేశం..!
దేశానికి ప్రధానిగా సేవలందించిన ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పీవీ నరిసంహారావు. ఒక్క పదవి మాత్రమే కాదు.. దేశానికి ఆర్థిక పునాదులు వేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి.. పదవి పోయిన తర్వాత.. మరణం తర్వాత కూడా.. దానికి తగ్గట్లుగా గౌరవం పొందలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా ఆయనను దూరం పెట్టింది. ఢిల్లీలో అంత్యక్రియలకూ సమ్మతించలేకపోయారు. ఆయన గొప్ప తనాన్ని ఇప్పుడు ఇతర పార్టీలు హైలెట్ చేస్తున్నాయి. పీవీ పచ్చి సమైక్య వాది. ఆ విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్.. ఆయన శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. పార్టీలకు అతీతంగా అందరూ పీవీని ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఎంత చేసినా.. దేశానికి ఆయన చేసిన సేవ కంటే తక్కువే.