తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న మార్పు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబానికి ఎక్కడ లేని ప్రాధాన్యత తెచ్చి పెడుతోంది. ఉద్యమ సమయంలో పీవీని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు… ఆయనను మహనీయుడ్ని చేస్తున్నారు. ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు.. మరో అడుగు ముందుకేసి…ఆయన కుమార్తెను ఎమ్మెల్సీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవి… ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు ఆమెను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టులో మరో స్థానం ఖాళీ అవుతుంది. అంటే మొత్తం మూడు స్థానాలు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి.. పీవీ కుమార్తెకు కేటాయించాలన్న ఆలోచన టీఆర్ఎస్ హైకమాండ్ చేస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. గత సార్వత్రికఎన్నికల సమయంలోనే ఆయన ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు. ఈ సారి మాత్రం.. కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. ఎప్పుడూ పొగడని పీవీని ఇప్పుడు.. కేసీఆర్ మహానీయుడిగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్కు దూరం చేస్తున్నారు. ప్రధానిపదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీని కాంగ్రెస్ పట్టించుకోలేదు. అది బహిరంగరహస్యం. దీన్నే కేసీఆర్ అస్త్రంగా మార్చుకున్నారు. కాంగ్రెస్.. అవమానించిందని.. ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని దాన్ని తామిస్తున్నామని.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కేసీఆర్ చూపిస్తున్న ఆదరణ.. పీవీ కుటుంబసభ్యులనూ ఆకర్షిస్తోది. పీవీ శతజయంతి ఉత్సవాలకు ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ వేసి.. అందులో పీవీ కుటుంబ సభ్యులకూ చోటు కల్పించారు. అదే కాంగ్రెస్ నేతలు కూడా… మాజీ మంత్రి గీతారెడ్డి చైర్మన్గా, మాజీ ఎంపీ వీహెచ్ గౌరవాధ్యక్షునిగా టీపీసీసీ హడావుడిగా పీవీ శత జయంతి ఉత్సవ కమిటీని వేసింది. అందులో ఉండేందుకు పీవీ కుమారులు, కుమార్తెలు సిద్ధపడలేదు. ఈ పరిణామాలన్నింటితో.. పీవీ కుటుంబం టీఆర్ఎస్కు దగ్గరైనట్లేనని చెబుతున్నారు. పీవీ కుమార్తె ఎమ్మెల్సీ స్థానం అంగీకరిస్తే.. ఇక టీఆర్ఎస్.. పీవీని జాతీయ స్థాయిలో తమ వాడిగా ప్రచారం చేసుకునే వ్యూహాన్ని అమలు చేసినా ఆశ్చర్యం లేదనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది.