మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పాలనాకాలంపై ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వాస్తవాలు నిర్మోహమాటంగా అంచనా చెప్పేశారు. జర్నలిస్టు వినరు సీతాపతి ఆయనపై రాసిన హాప్‌లయన్(అరసింహుడు లేదా సగం సింహం) పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అన్సారీ మాజీ ప్రధాని మంచిపనులు ఆయన తర్వాత కూడా ప్రభావం చూపిస్తుంటే అప్పటి ప్రతికూల పరిణామాలు తీవ్రమైన సష్టం కలిగిస్తూనే వున్నాయని స్పష్టం చేశారు. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను సానుకూల పరిణామాలుగా ఆయన అభివర్ణించారు.పార్లమెంటు నిర్వహణలో అనైతిక పద్దతులు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం పెద్ద పొరబాట్లన్నారు. అది వెంటాడే పీడకల అని తీవ్రంగానే తీర్పు చెప్పారు. బాబరీ మసీదు విధ్వంసానికి అవకాశమివ్వడం కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిందే తప్ప రాజ్యాంగ కొలబద్దలతో సరిపోదన్నారు. తన హిందూ విశ్వాసాలను నిలబెట్టుకోవడం, హిందువుల కాంగ్రెస్‌కు దూరం కాకుండా కాపాడుకోవడం, మసీదును కాపాడ్డం అనేవి పివి లక్ష్యాలుగా పెట్టుకున్నారు. చివరకు మసీదు ధ్వంసమైంది, హిందువులు దూరమైనారు.
కాంగ్రెస్ ప్రతిష్ట మంటగలసింది అని సీతాపతి ఇచ్చిన తీర్పుతో అన్సారీ ఏకీభవించారు. . విధ్వంసాని నివారించడానికి తామంతా ఎన్నో సూచనలు చేసినా పివి వినిపించుకోలేదని ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన మణిశంకర్ అయ్యర్ఆయన చెప్పారు. పివి తెలంగాణ బిడ్డ కనుక, నెహ్రూ కుటుంబేతరుడు గనక కావాలనే ఆయన స్థానాన్ని తగ్గించి చూపుతున్నారనే వాదనకు తెలుగు పత్రికలలో పెద్ద పీట వేస్తున్నారు. బోలెడు సెంటిమెంటు కూడా జోడిస్తున్నారు. సోనియా గాందీకి ఆయనకూ మధ్యన వైరుధ్యాలు వ్యక్తిగత అన్యాయాలు నిజమే కావచ్చు. ఆ మాటకొస్తే ఆయన ఆ కుటుంబం పట్ల విధేయుడు కాకపోతే ప్రధాని కాగలిగేవారు కాదు. మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని ఎఐసిసి ఆఫీసులోకి రానివ్వకపోవడం, హైదరాబాదులో అంత్యక్రియలు జరిపించడం ఇవన్నీ దారుణమే. కాని పివి పాండిత్యం, అనుభవం వంటివాటిని గౌరవిస్తూనే ఆయన పాలనలో అన్ని పార్శ్యాలనూ చూస్తేనే తప్ప సరైన అంచనా సాధ్యం కాదు.
ఆర్థిక సంస్కరణల విషయంలోనూ రెండు అభిప్రాయాలున్నాయి.వామపక్షెతరులు వాటిని పూర్తిగా పొగిడేస్తుంటారు. కాని అంతకు మించి బాబరీ విషయంలో అందరికీ బిన్నాభిప్రాయాలున్నాయి. అనేక మతాలున్న ఈ దేశంలో బాబరీ విధ్వంసానికి అవకాశమిచ్చిన ఆయన చర్యను చూడనిరాకరించడం కుదిరేపని కాదు. ఈ పుస్తకం కూడా పివి ద్వంద్వత్వాన్ని కళ్లకు కట్టినట్టు చెబుతున్నది. ఎన్ఐసి సమావేశమే ఆయనకు సర్వాధికారాలుఇచ్చిన తర్వాత కూడా అయోధ్యలో కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని కాదని పరిస్థితిని ఎందుకు తన చేతుల్లోకి తీసుకోలేదు? మసీదు విద్వంసానికి రెండు మూడు రోజుల ముందు విజయవాడ ప్రెస్‌క్లబ్ అద్యక్షుడుగా విహెచ్పి అద్యక్షుడు అశోక్ సింఘాల్‌తో మీట్ ద ప్రెస్ నిర్వహించాము. అప్పుడు నేను మీరు తలపెట్టిన కరసేవ మరో మత ప్రళయానికి దారితీసే ప్రమాదముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారని అన్నాను. దానికాయన ఏదో సమర్థనగా మాట్లాడారు. అప్పటికి పివి ఏవో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వున్నాయి. ఒక విలేకరి ప్రశ్నకు సమాధానంగా సింఘాల్ పివి మంచి హిందువు అని కితాబిచ్చారు. వ్యక్తిగత వైద్యుడు డా.శ్రీనాథరెడ్డి, సీతాపతి, మణిశంకర్ అయ్యర్ మాటలే గాక ఆ రోజున ఆయన వ్యవహరించిన తీరు గురించి హౌంమంత్రిగా వున్న ఎస్‌బిచవాన్ వంటివారు రాసింది చూసినా పివి ఉపేక్ష స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో సిబిఐ డైరెక్టర్‌గా వున్న విజయరామారావు కూడా బాబరీ కూల్చివేతకు శిక్షణ పొందారన్న సమాచారం తమకు ఆలస్యంగా తెలిసిందని అంటుంటారు గాని అది హాస్యాస్పదమే. పివి కాంగ్రెస్ అద్యక్షుడు, ప్రధాని. కాంగ్రెస్‌ను అందులోనూ సోనియాగాంధీని మాత్రమే విమర్శించి ఆయనను సమర్థించాలనుకోవడం కుదిరేపని కాదు. అదంతా ఒకే వ్యవస్థ. ఒక క్రమం.బిజెపి టిఆర్ఎస్ టిడిపి లేదా సామాజిక కోణంలో ఆ పనిచేయాలనుకునే వారు అనేక సమాధానాలు చెప్పాల్సి వుంటుంది. అరసింహుడు అని ఇంగ్లీషు టైటిల్ అయితే నరసింహుడు అనితెలుగులో ఇవ్వడంలోనే ఈ సమర్థనాపేక్ష తెలిసిపోతుంది. పాండిత్యాన్ని పొగడొచ్చు గాని పాలనలో దారుణాలను కూడా కీర్తించాలనుకోవడం సరికాదు.