కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబును రాత్రికి రాత్రి అరెస్టు చేయాలనుకున్నారు. లండన్ లో ఉన్న జగన్ రెడ్డికి హై కావాలని అనిపించిందో.. ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి అరెస్ట్ చేసి తన చిరకాల కోరికను తీర్చుకోవాలనుకున్నారో కానీ ఆదేశాలు వచ్చేశాయి.దాంతో సీఐడీ అధికారులు అరెస్టుకు రెడీ అయ్యారు. మరి ఎలా అరెస్టు చేస్తారు ?. వెంటనే మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ను తీసుకుని తమకు కావాల్సిన మార్పులు చేసుకున్నారు. దాన్ని చూపించి అరెస్టు చేశారు. ఆ స్టేట్మెంట్ ఏమిటో పీవీ రమేష్కూ తెలియలేదు. తాను ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అరెస్టు చేశారని తెలిసిన తర్వాత .. తాను అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చానని దాన్ని పట్టుకుని ఎలా అరెస్టు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.
పీవీ రమేష్ అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన ఇవ్వని స్టేట్ మెంట్ ను ఇచ్చినట్లుగా రాసుకున్నారు. తాను స్కిల్ కేసు విషయంలో సీఐడీకి ఇచ్చిన స్టేట్మెంట్ తన వద్ద ఉందని.. సీఐడీ వద్ద ఉన్న స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారో తేల్చాలని ఆయన అడుగుతున్నారు. ఆ స్టేట్మెంట్లో ఉన్న విషయాలేమీ తాను చెప్పలేదని.. చెప్పని విషయాలను కూడాచేర్చి చంద్రబాబును కుట్ర పూరితంగా అరెస్టు చేశారని గుర్తించారు. ఇదే విషయాన్ని తాజాగా ఆయన సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడును అరెస్టు చేసేందుకు తన వాంగ్మూలాన్ని పావుగా వాడుకోవడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో సీఐడీ అధికారులు చేసిన నేరాలన్ని బయట పెట్టాలని అనుకుంటున్నారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం మొత్తం సస్పెన్సే. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్ ఇలా కొంత మంది అధికారులు ఓ ముఠాగా ఏర్పడి తప్పుడు వాంగ్మూలాలు, ఫేక్ రిపోర్టులు, సంతకాల ఫోర్జరీలు ఇంకా చెప్పాలంటే స్కిల్ కేసులో సమాచారం కళ్ల ఎదురుగా ఉన్నా దాచి పెట్టి తప్పుడు కేసులు పెట్టారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం లేదా అవినీతి జరిగినట్లుగా తేల్చకపోయినా పీవీ రమేష్ వాంగ్మూలం ఇచ్చారని అరెస్టు చేశారు. వ్యవస్థలను అత్యంత ఘోరంగా మేనేజ్ చేశారు. ఈ కుట్ర అంతా.. బయటకు రావడానికి మళ్లీ పీవీ రమేష్ నుంచే బీజం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.