మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తాజాగా రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని పెట్టిన కేసులు.. తాను అప్రూవర్ అంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియాతో మాట్లాడనున్నారు. సోమవారం ఆయన ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన ఇప్పటికే సలహాదారుగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆయన తన ఉద్యోగానికి నిన్ననే రాజీనామా చేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెడతానని ఆయన సోమవారం చెప్పారు.
ఉద్యోగానికి రాజీనామా చేసినందున ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాల ఉన్నాయి. ప్రైవేటు సంస్థకు చేసిన రాజీనామా కావడంతో పీవీ రమేష్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఓ సీనియర్ జర్నలిస్టు చేసిన ట్వీట్‌ను షేర్ చేసి తన అభిప్రాయం చెప్పారు. ఆ ట్వీట్లో ఆయనను మేఘా సంస్థ రాజీనామా చేయమని కోరిందని ఉంది. అయితే అలా కోరలేదని తానే రాజీనామా చేశానన్న అర్థంలో ట్వీట్ చేశారు. పీవీ రమేష్ రిటైరైన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. కరోనా సమయంలో కీలకంగా పని చేశారు. అయితే తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదు.
కారణం ఏదైనా ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మేఘా సంస్థలో చేరారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఆ సంస్థ కే రివర్స్ టెండర్లలో పోలవరం ప్రాజెక్టు సహా అనే ప్రాజెక్టులు దక్కాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ సంస్థలో పని చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తన వాదన వినిపించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.