ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి.. హఠాత్తుగా ప్రాధాన్యం కోల్పోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్.. ట్విట్టర్ వేదికగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ” ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు” అనే ఓ ట్వీట్ చేసి.. దాన్ని ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్‌కు ట్యాగ్ చేశారు. నిజానికి అది ఆయన అభిప్రాయం కాదు.. వేరే ఐఏఎస్ అధికారి చేసిన దాన్ని రీ ట్వీట్ చేశారు. అలాగే.. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్.. చేసిన వ్యాఖ్యలను కూడా పోస్ట్ చేశారు. పీవ రమేష్ ట్వీట్లు.. అధికారవర్గాల్లో సహజంగానే అలజడికి కారణం అవుతున్నాయి. ఎందుకంటే.. పీవీ రమేష్ నిన్నామొన్నటి వరకూ.. ఏపీ సర్కార్‌లో కీలకమైన వ్యక్తి. ఆయన రిటైరైనప్పటికీ.. ఉన్నత పదవి ఇచ్చి సీఎంవోలోనే ఉంచుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఏం జరిగిందో ఏమో కానీ… గత వారం.. ఆయనకు చెందిన అధికారాలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టారు. కేవలం పదవి మాత్రమే ఉంది. దాంతో.. పీవీ రమేష్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నారు. తన చాంబర్‌కు కూడా వెళ్లడం లేదు. కానీ ట్వీట్లు మాత్రం చేస్తున్నారు. పీవీ రమేష్‌కు ప్రతిభావంతమైన అధికారిగా పేరున్నా.. వైఎస్ ముద్ర ఉంది. వైఎస్ హయాంలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు హయాంలోనూ ఆయనకు కీలక పోస్టులు దక్కినప్పటికీ.. ఇతర ఐఏఎస్‌లతో సఖ్యతగా ఉండకపోవడం వంటి కారణాల వల్ల కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎంవోలోకి వచ్చారు. అలా వచ్చిన కొన్ని రోజులకే.. రిటైరైనా… జగన్ ప్రత్యేకంగా పదవి ఇచ్చారు. పీవీ రమేష్.. వైఎస్ కుటుంబాన్ని.. జగన్ ను … తన విధేయతతో సంతృప్తి పరిచే ప్రయత్నం చేయడం వల్లనే ఆయనకు పోస్టులు దక్కాయని ఉన్నతాధికారులు చెప్పుకుంటూ ఉంటారు.
ఇప్పుడు.. అంతర్గతంగా ఏదో జరిగి.. ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయిన తర్వాత.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు, వ్యాపారవేత్తల కోసం కోసం పని చేస్తున్నారనే అర్థం వచ్చేలా విమర్శలు చేయడం.. ఏమిటన్న అభిప్రాయం.. అధికార వర్గాల్లో వినిపిస్తోంది. బహుశా.. మళ్లీ తన ప్రాధాన్యత కోసం .. ఆయన ట్విట్టర్ ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమోనని.. ముఖ్యమంత్రి మళ్లీ.. ఆయనకు ప్రాధాన్యం ఇస్తే.. ఇలాంటి ట్వీట్లు మానేసి.. గొప్పగా పని చేస్తున్నారనే కితాబులు ఇస్తారని సెటైర్లు వేస్తున్నారు.