జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారిని అన్న సంగతిని మర్చిపోయి వైసీపీకి సర్వీస్ చేసి ఘోరమైన తప్పులు చేసిన పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మారినప్పటి నుండి ఆయనకు పోస్టింగ్ లేదు. పలు అంశాల్లో ఆయన చేసిన నేరాలపై విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ సారి స్వీడన్, మరోసారి దుబాయ్ రహస్యంగా వెళ్లి వచ్చారు. ప్రభుత్వ వర్గాలకు సమాచారం ఇవ్వకుండా ఆయన ఈ పర్యటనలకు ఎందుకు వెళ్లారన్న దానిపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అనుచితంగా మాట్లాడినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ తో పాటు సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు ఓ అరాచకశక్తిగా మారి అనేక మందిని తప్పుడు కేసులతో వేధించి ధర్డ్ డిగ్రీలు ప్రయోగించిన వ్యవహారంలోనూ ఆరోపణలు ఉన్నాయి.
అలాగే నిధుల దుర్వినియోగం, అగ్రిగోల్డ్ నిధుల పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఓ మత మార్పిడి సంస్థను కూడా నడుపుతున్నారని.. ఆ సంస్థ తరపున కార్యక్రమాల్లో దేశానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆర్పీ సిసోడియా నేతృత్వంలో కమిషన్ విచారణ జరుపుతోంది.