ఊపిరి సినిమా కి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ అయినా.. ఒక్కసారి యూ ట్యూబ్‌కి వెళ్లి చూడండి ‘ప్రసాద్ పొట్లూరి నా బ్రదర్… నాకు లైఫ్ ఇచ్చారు. ఆయన ట్రీట్ చేసిన విధానం అద్భుతం..’ అంటూ వంశీపైడిపల్లి భుజాలు గజాలైపోయి ఇచ్చిన స్పీచులు కనిపిస్తుంటాయి.
పీవీపీ కూడా అంతే. ‘వంశీ చాలా టాలెంటెడ్.. అలాంటి దర్శకుడు దొరకడం నా అదృష్టం’ అన్నట్టు మాట్లాడాడు.
సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఇద్దరికీ ఒక్క క్షణం పడడం లేదు. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అయిపోయారు. ఇప్పుడు పీవీపీప్రసాద్ ఏకంగా.. వంశీ పైడిపల్లిపై ఫిల్మ్‌చాంబర్ లో ఫిర్యాదు చేసేశారు. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ఇంత గ్యాప్ రావడానికి కారణమేంటి?
ఊపిరి సినిమా టైమ్ లోనే.. వంశీ పైడిపల్లికి మరో సినిమా కోసం ఎగ్రిమెంట్ చేయించుకొంది పీవీపీ సంస్థ. వంశీ – మహేష్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలన్నది ప్రసాద్ ప్లాన్. మహేష్ కూడా అందుకు ఓకే అన్నాడు. అయితే.. ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. మరో రెండేళ్లయినా పూర్తి కాదని తేలిపోవడంతో… మహేష్ తాను తీసుకొన్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశాడు. పీవీపీ ప్లేసులో అశ్వనీదత్, దిల్‌రాజులను తీసుకొచ్చి సినిమా ఫిక్స్ చేశాడు మహేష్. మహేష్ ఎప్పుడైతే జారుకొన్నాడో అప్పుడు వంశీ పైడిపల్లి కూడా పీవీపీ నుంచి బయటకు వచ్చేశాడు. అంటే.. పీవీపీలో వంశీ సినిమా చేయలేడన్నమాట. ఈ విషయం తెలిసి ప్రసాద్ వి పొట్లూరి రివర్స్ అయ్యాడు. ‘చేస్తే నా సంస్థలోనే చేయాలి, లేదంటే నష్టపరిహారం కట్టు’ అంటూ నిలదీశాడు. ఇప్పుడు ఆ గొడవే ఫిల్మ్ ఛాంబర్‌కి వెళ్లింది. తమిళ ఫిల్మ్ ఛాంబర్లో కూడా వంశీపై ఫిర్యాదు చేశాడు ప్రసాద్ పొట్లూరి. `ఆరు నెలల పాటు నా ఆఫీసులో కూర్చుని ఓ కథ తయారు చేసుకొన్నాడు. ఆ కథపై సర్వహక్కులూ మా సంస్థవే. ఆ కథని మరో బ్యానర్లో చేయడానికి వీల్లేదు` అనేది ప్రసాద్ వి.పొట్లూరి ఫిర్యాదులోని సారాంశం. అంటేఅటు తమిళ, ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లలో వంశీని లాక్ చేసేశాడన్నమాట. దీనిపై వంశీ ఎలా స్పందిస్తాడో, ఫిల్మ్ ఛాంబర్ ఏమంటుందో చూడాలి. సినిమా వాళ్ల మధ్య కనిపించే నవ్వులు, ఆప్యాయతలు, సోదర భావం ఆ సినిమా వరకే. లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా… ఇదిగో వ్యవహారం ఇలా తయారవుతుంది.