ప్రముఖ నిర్మాణ సంస్థ పీపీవీ మళ్లీ ముమ్మరంగా సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి చిన్న సినిమాలవైపు మొగ్గు చూపిస్తోంది. ఒక పెద్ద సినిమా చేసే బదులు.. అరడజను చిన్న సినిమాలు చేస్తే, కనీసం సగం గిట్టుబాటు అయినా – లాభసాటిగానే ఉంటుందన్నది పీవీపీ ప్లాన్. అందులో భాగంగానే ఈ మధ్య ఓ తమిళ సినిమా రైట్స్‌ని కొనుగోలు చేసింది. ‘ఓ మై కదవులే’ పేరుతో వచ్చిన ఈ సినిమా తమిళ నాట మంచి విజయాన్ని అందుకుంది. ఈసినిమాని విశ్వక్సేన్తో చేయాలని ప్లాన్ చేసింది పీవీపీ. ఇటీవల విశ్వక్‌కి ఈ సినిమా కూడా చూపించింది. కానీ… ఏమైందో మరి, విశ్వక్ ఈ సినిమా చేయనని చెప్పేశాడు. విశ్వక్ ఎక్కువగా మాస్ ఇమేజ్‌ని కోరుకుంటున్నాడు. `ఓ మై కదవులే`లో మాస్ అంశాలు పెద్దగా లేవని తేలడంతో.. విశ్వక్ ఒప్పుకోలేదు. విశ్వక్ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికం కంటే, కాస్త ఎక్కువే ఆఫర్ చేసినట్టు టాక్. కానీ.. దానికీ తను లొంగలేదు. విశ్వక్ కాదనడంతో మరో హీరో అన్వేషణలో పడింది పీవీపీ.