భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు పూర్తయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరును భాజపా అధినాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని సమాచారం. నాలుగేళ్లుగా ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కసరత్తు ప్రారంభించారు. పార్టీ బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగిస్తారనే ప్రచారమే జోరుగా జరిగింది. ఎందుకంటే, మొదట్నుంచీ టీడీపీ మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా ఆయనే ఘాటుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు కదా! ఆయనకి అవకాశం ఇస్తే అదే దూకుడును కొనసాగిస్తారనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే, కొద్దిరోజుల కిందట మాణిక్యాలరావు పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. వీర్రాజుతో పోల్చితే మాణిక్యాలరావు కాస్త సౌమ్యుడు. వీర్రాజు మాదిరిగా దూకుడు ప్రదర్శించరు. బహుశా ఈ లక్షణమే అమిత్ షాకి నచ్చి ఉండొచ్చు. ఎందుకంటే, ఏపీ బాధ్యతలు నిర్వహించాలంటే… జాతీయ నాయకత్వం ఆదేశాలను శిరసావహించాల్సి ఉంటుంది కదా. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత సంయమనం కూడా పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక మాణిక్యాలరావు పేరును ఖరారు చేశారని ప్రాథమికంగా సమాచారం అందుతోంది.