ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులపై ఇస్తామని చెప్పిన నాణ్యమైన బియ్యం పంపిణీ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. పదవి చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే.. సన్నబియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించారు. సన్న బియ్యం పంపిణీ సాధ్యం కాదని తేలిన తర్వాత నాణ్యమైన బియ్యంగా దాన్ని మార్చారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అప్పుడే సీఎం జగన్.. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామన్నారు. మే వచ్చిన తర్వాత మళ్లీ సెప్టెంబర్‌కి మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలు ఏపీ సర్కార్ ఇచ్చే సన్నబియ్యం కోసం.. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం రేషన్ కార్డుల కింద ఇస్తున్న బియ్యం దొడ్డు బియ్యం. అవి తినగలిగేవి కాదు. అలా తీసుకుని.. ఇలా వ్యాపారులకే కేజీ పది చొప్పున అమ్మేసేవాళ్లే ఎక్కువ. ప్రభుత్వం చెప్పే.. సన్న, నాణ్యమైన బియ్యం ఇస్తే… ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే.. ఈ పథకం విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి నిర్ణయాలు మార్చుకుంటూనే ఉంది. మొదట రూ. 750 కోట్ల బడ్జెట్‌తో సంచులు కొనాలని నిర్ణయించింది. ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేయాలనుకుంది. నిధులు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చింది. అయితే అ సంచుల సంగతి ఏమైంది క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరే వాలంటీర్లు కొలిచి ఇచ్చే విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించారు.
దీని కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇలా మొత్తం పదమూడు వేల వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. వీటి వల్ల అసలు కన్నా.. కొసరు ఖర్చే ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే.. రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామన్నది తమ ప్రభుత్వ హామీ కాబట్టి.. ఎంత ఖర్చు అయినా.. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చెబుతోంది. సెప్టెంబర్ నుంచి.. రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఇంటి దగ్గరకు… బియ్యం తీసుకెళ్లి కొలిచి ఇస్తామని.. డోర్ డెలివరీ చేస్తామని అంటున్నారు.